తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఏ పండుగైనా.. అదెంత పెద్దదైనా.. ఒక్కరోజే ఉంటుంది. కానీ.. సంక్రాంతి సో స్పెషల్. మొత్తం మూడు రోజుల పండుగ. అందుకే.. ఎక్కడున్నా సరే.. ఈ పండక్కి మాత్రం సొంతూరుకు వచ్చేందుకు తెగ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అందునా రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎవరి ఇళ్లల్లో వారు ఉండిపోవటమే తప్పించి బయటకు రాని పరిస్థితి.
ఈసారి భారీగా ప్లాన్లు వేసుకున్న చాలామంది.. థర్డ్ వేవ్ కారణంగా ప్రయాణాల్ని వాయిదా వేసుకున్నారు. మరికొందరు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా సొంతూళ్లకు పయనమయ్యారు. ఆ జాబితాలో ప్రముఖ సినీ నటుడు కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు ప్రకాశం జిల్లా కారంచేడుకు వచ్చారు.
బాలయ్య సోదరి కమ్ బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి వారి అత్తారిల్లు కారంచేడు. పెద్ద పండక్కి ఊరికి వచ్చిన వేళ.. అక్క ఇంటికి భార్యతో సహా వచ్చారు బాలకృష్ణ. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బాలయ్య ఇతర సోదరీమణులు లోకేశ్వరి.. ఉమామహేశ్వరితో సహా బంధువులంతా కారంచేడుకు రావటంతో.. ఊరికి మరింతగా కళకళలాడిపోయిన పరిస్థితి.
నిజానికి ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి అక్క పురంధేశ్వరి ఇంటికి బాలయ్య కుటుంబ సభ్యులు వెళ్లేవారు. తర్వాత నుంచి బాలకృష్ణ సతీమణి మాత్రమే వెళుతున్నారు. ఈసారి మాత్రం తన అలవాటును మార్చుకున్న బాలయ్య.. భార్యతో కలిసి గురువారం సాయంత్రం అక్క ఇంటికి చేరుకున్నారు.
బాలయ్య తాజా చిత్రం అఖండ అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. మహా హుషారుగా ఉన్న బాలయ్యను చూసేందుకు.. కారంచేడు గ్రామస్తులు పెద్ద ఎత్తున పురంధేశ్వరి ఇంటికి వచ్చారు. అయితే.. కరోనా నేపథ్యంలో గ్రామస్తుల్ని ఇంట్లోకి అనుమతించలేదు.
ఇక.. సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగిని ఈ రోజు ఉదయం ఘనంగా జరుపుకున్నారు. పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో పాటు.. బాలయ్య దంపతులు.. నందమూరి కుటుంబానికి చెందిన పలువురు భోగి మంటలు వేసి.. పండుగను జరుపుకున్నారు. వీరందరిని చూడటానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. మొత్తానికి బాలయ్య ఎంట్రీతో కారంచేడులో సంక్రాంతి సంబరాలు డబుల్ అయ్యాయి.