టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. యువగళం పేరుతో లోకేష్ రాష్ట్రంలో 4000 కిలోమీటర్ల మేర 400 రోజులపాటు పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్రకు పలు షరతులతో కూడిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయినా సరే పాదయాత్రను దిగ్విజయం చేస్తామని అంటున్నారు.
అంతకుముందు, పాదయాత్రకు బయలుదేరేముందు తన మేనమామ నందమూరి బాలకృష్ణ దంపతుల ఆశీస్సులను లోకేష్ తీసుకున్నారు. ఇప్పటికే కుప్పం చేరుకున్న లోకేష్ రేపు ప్రారంభం కానున్న పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ పాదయాత్రపై బాలకృష్ణ స్పందించారు. లోకేష్ పాదయాత్రను చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని బాలకృష్ణ విమర్శించారు. ఆ భయంతోనే లోకేష్ పాదయాత్రకు ఎన్నో ఆంక్షలు మరెన్నో నిబంధనలు విధిస్తోందని ఆరోపించారు.
తన అల్లుడు లోకేష్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, రాష్ట్రంలోని యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే పాదయాత్ర చేస్తున్నాడని బాలకృష్ణ అన్నారు. కుప్పంలో జరగబోయే రేపటి పాదయాత్రలో లోకేష్ తో పాటు తాను కూడా పాల్గొనబోతున్నానని ప్రకటించారు. అంతేకాదు, పాదయాత్ర జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు వెళ్లి తాను లోకేష్ ను కలుస్తుంటానని కూడా బాలకృష్ణ వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు పాలన అవసరమని బాలకృష్ణ అన్నారు. ఇక రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్, ఒక చంద్రబాబు కావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. హిందూపురంలోని సరస్వతి విద్యా మందిర్ లో వసంత పంచమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.