ఆంధ్రప్రదేశ్ ను సీఎం జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారని, జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలు, ఉచిత హామీల పేరుతో ప్రజాధనాన్ని జగన్ దుబారా చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను జగన్ మోసం చేశారని బాలయ్య విమర్శలు గుప్పించారు. అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, సంపదను ఎలా సృష్టించాలో తెలియని జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని బాలయ్య దుయ్యబట్టారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్లోకి తెచ్చిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై కూడా బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తొలిసారిగా గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన బాలయ్య…పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రజా సేవ చేయాల్సిన గోరంట్ల మాధవ్ ప్రజలకు నీలి చిత్రాలు చూపించారని, అటువంటి ఎంపీపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని బాలయ్య నిలదీశారు. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ సభ్య సమాజం తలదించుకునే పని చేశారని బాలకృష్ణ మండిపడ్డారు. హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు మాధవ్ ఏ ముఖం పెట్టుకొని వచ్చారని బాలకృష్ణ ప్రశ్నించారు.
హిందూపురంలో రెండు రోజులపాటు బాలకృష్ణ సతీసమేతంగా పర్యటించారు. ఈ క్రమంలోనే చలివెందులలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని బాలయ్య తన సతీమణి వసుంధరా దేవితో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత లేపాక్షిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్, గోరంట్ల మాధవ్ పై బాలకృష్ణ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.