నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. యంగ్ జనరేషన్ హీరోలతో పోటీ పడుతూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బాలయ్య తన సినిమాల్లో యాక్షన్, ఎలివేషన్స్ తో పాటు ఎమోషన్స్ కు కూడా పెద్ద పీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చిత్రాలకు పాప సెంటిమెంట్ అనేది పరిపాటి అయింది. బాలయ్య కంబ్యాక్ చిత్రం `అఖండ`లో కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్రలో ఓ పాప కనిపించింది. త్వరలో రాబోయే `అఖండ 2`లో కూడా ఆ పాప పాత్ర కీలకంగా ఉండబోతోంది.
అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన `భగవంత్ కేసరి` లోనూ పాప సెంటిమెంట్ ఉంటుంది. శ్రీలీల చిన్నప్పటి పాత్రను ఓ పాప పోషించింది. ఆ పాపతో బాలయ్యకు కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ కూడా ఉంటుంది. 2023లో విడుదలైన భగవంత్ కేసరి సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం బాలయ్య `డాకు మహారాజ్` అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.
ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్లు కాగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. అయితే బాలయ్య హిట్ సెంటిమెంట్ డాకు మహారాజ్ లోనూ రిపీట్ అవుతుంది. అవును, డాకులో ఓ చిన్న పాప పాత్ర కీలకం అన్నట్లు సితార హింట్స్ ఇస్తుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అంతేకాదండోయ్.. ఆ పాపతో బాలయ్యకు `చిన్ని` అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్ ను డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పర్చుకున్న డాకు మహారాజ్ కు పాప సెంటిమెంట్ కలిసొస్తే.. బాలయ్య మరో హిట్ కొట్టడం ఖాయమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.