ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహామూర్తులపై జరుగుతున్న దాడులపై హిందూపురం ఎమ్మెల్యే కమ్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ స్పందించారు. నాలుగు నెలల తర్వాత తన నియోజకవర్గానికి వచ్చిన ఆయన.. దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసంపై స్పందించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఖండించటమే కాదు.. విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్న వారి చేతులు ఖండించాలన్నారు. ఇప్పటివరకు 140 గుళ్ల మీద అనేక రకాలైన దాడులు జరిగాయన్నారు.
ఇంద్రకీలాద్రిలో మూడు సింహాలు మాయమ్యాయయని.. అంతర్వేదిలో రథం తగలబడిందన్న ఆయన.. ఓట్ల కోసం వచ్చి ఏవేవో చెబుతారని.. అమ్మఒడి అంటూ డబ్బులు ఇస్తారని.. ఒకసారి అవకాశం ఇద్దామని ఇస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయోచూస్తున్నారు కదా? అంటూ నిష్ఠూరాలు ఆడారు. ఏం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ‘ఒక సారి అవకాశం ఇవ్వాలనే కదా ఓట్లు వేశారు. ఇచ్చారు. ఏం చేస్తున్నారో చూస్తున్నారు కదా?’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్న బాలయ్య.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నడ్డి విరుస్తుందన్నారు.
అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని.. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నారుగా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో యువత.. రైతులు..కార్మికులు.. అందరూ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి. ఇక్కడ నుంచే ప్రారంభం వారి నాశనం. ఏవేవో హామీలు ఇచ్చి.. పగల్భాలు పలికి.. రైతు పక్షం..కార్మిక పక్షం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.
అంతా బాగానే ఉంది కానీ బాలయ్య.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఉదంతాల కారణంగా మీ మనసు భారీగా గాయపడిందని మీ మాటలు వింటే అర్థమవుతున్నాయి. మరి.. ఇంతలా వేదన చెందినప్పుడు వెంటనే కాకుండా.. ఇన్ని రోజుల తర్వాత స్పందించటం ఏమిటంటారా? మా ఇష్టం మేం స్పందించినప్పుడే మీరు రాసుకోవాలి.. ఎదురుప్రశ్నలు వేయకూడదంటారా?