ఓవైపు హెరిటేజ్ వ్యాపారం.. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలతో పాటు.. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే చంద్రబాబు కోడలు.. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి మరో కీలక బాధ్యతల్ని తాజాగా స్వీకరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోచురుగ్గా పాల్గొనే బ్రాహ్మణి.. తాజాగా తన తండ్రి పర్యవేక్షణలో సాగుతున్న ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టుకు బోర్డు మెంబర్ గా నియమితులయ్యారు.
తాజాగా ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పేర్కొన్న బాలయ్య.. ‘నా ప్రియమైన కుమార్తె నారా బ్రాహ్మణిని మా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కుటుంబానికి స్వాగతిస్తున్నాను. కొత్తగా ట్రస్టు బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు అభినందనలు’’ అని అభినందనలు తెలిపారు.
ఇక.. ట్రస్టు బోర్డు సభ్యురాలిగా బాధ్యత చేపట్టిన నారా బ్రాహ్మణి మాట్లాడారు. రోగులు క్యాన్సర్ పై విజయం సాధించేలా పోరాటానికి వారికి అండగా నిలుద్దామన్నారు. పిల్లవాడికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తిస్తే.. అది వారి కుటుంబాన్ని అప్రమత్తం చేస్తుందన్నారు. చిన్నారి క్యాన్సర్ పేషెంట్ల కోసం పోరాడుతున్నకుటుంబాలకు.. వైద్య సిబ్బందికి.. నిపుణులకు తాను సెల్యూట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.