ఏపీ ప్రధాన ప్రతిపక్షం.. టీడీపీ అనుసరిస్తున్న పంథాలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతానికి భిన్నంగా పార్టీ ముందుకు సాగుతోంది. వాస్తవానికి ఏ పార్టీ అయినా.. గెలిచే అవకాశం ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తుంది. ఓడిపోయే పరిస్థితిలో ఉన్న వారిని పక్కన పెడుతుంటాయి. సహజంగా అన్ని పార్టీ ల్లోనూ జరిగేదే ఇది.
అయితే.. గత ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత కూడా టీడీపీ తన పంథాను మార్చుకోలేదు. పైగా ఓడిపోయిన వారినే తిరిగి ఎన్నికల్లో నిలబెడుతోంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం.. చంద్రబాబు చాలా దూరదృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
పార్టీలో కొన్నేళ్లుగా ఉంటూ.. పార్టీ కోసం కృషి చేసినవారు.. ఒక దఫా ఓడిపోయినా.. వారికి మళ్లీ మళ్లీ అవకాశం ఇస్తుండడం వెనుక.. వారికి పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, విధేయతలే కారణమనిఅంటున్నారు పరిశీలకులు.
ఈ ఏడాది జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పనబాక లక్ష్మికి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ఆమె 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ.. ఉప ఎన్నిక ప్రారంభంలోనే ఆమెకు టికెట్ ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
ఇప్పుడు కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను ఖరారు చేశారు. ఈయన కూడా గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే. వీరిని ఎంపిక చేయడంపై పార్టీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఎవరైనా.. కూడా ఒకసారి ఓడిపోతే.. మళ్లీ టికెట్ ఇచ్చేందుకు వెనుకాడడం.. పైగా.. వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో దీనికి దీటుగా ఎదుర్కొనే నేతను ఎంపిక చేయడంఅనేది.. సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే. దీనికి భిన్నంగా చంద్రబాబు మాత్రం గత ఎన్నికల్లో ఓడిపోయిన వారినే చంద్రబాబు ఎంచుకుంటున్నారు. దీంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, దీని వెనుక చంద్రబాబు రెండు ప్రధాన లక్ష్యాలు పెట్టుకున్నారనేది సీనియర్ల మాట.
ఒకటి.. నైతికంగా.. నేతలను ఎంకరేజ్ చేయడం.. విధేయులుగా ఉన్నవారికి పార్టీ ఎప్పుడూ.. అవకాశం ఇస్తుందనే ధోరణిని స్పష్టం చేయడమేనని అంటున్నారు . రెండోది ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీని ఓడించడం కన్నా.. టీడీపీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో భాగంగా.. సీనియర్లను, ముఖ్యంగా యువతను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని.. భావిస్తున్నారు. దీనిలో భాగంగానే విధేయులుగా ఉన్న వారికి మళ్లీ మళ్లీ టికెట్లు ఇస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.