ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఏపీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో చంద్రబాబు అద్దెకు ఉండటం తెలిసిందే. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లిపోయిన ఆయన.. ఈ అద్దె నివాసంలో పెద్దగా ఉండటం లేదు. ఎక్కువగా హైదరాబాద్ లోని ఇంట్లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చినప్పుడు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా క్రిష్ణా కరకట్టకు లోపల ఉన్న 36 భవనాలకు అధికారులు వరద ప్రమాద హెచ్చరిక చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబందించిన పత్రాన్ని రెవెన్యూ అధికారులు ఇంటికి అతికించి వెళ్లారు. ఆదివారం ఉదయానికి 3.97లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని.. బ్యారేజీ ఎగువ భాగంలో నీటిమట్టం 12 అడుగులకు చేరుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఇంటికి వరద ప్రమాదం పొంచి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
గతంలోనూ వరద ప్రమాదం ఉందంటూ నోటీసులు ఇవ్వటం.. అప్పట్లో రాజకీయ దుమారంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసం ఉంటున్న అద్దె నివాసం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన నోటీసులు సైతం గతంలోనే జగన్ సర్కారు జారీ చేసింది. మరి.. అధికారులు పేర్కొంటున్నట్లుగా వరద ముప్పు ఎంతన్నది తాజా వరద ప్రవాహం చెప్పేస్తుందంటున్నారు.