టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వందల మంది వైసీపీ కార్యకర్తలు మందలాగా వచ్చి రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. జడ్ క్యాటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి ఇంటి పరిస్థితే ఇలా ఉంటే….ఏపీలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 24 గంటల ముందే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అయన్న పాత్రుడు దుయ్యబట్టారు. విపక్ష నేతలపై పోలీసుల తీరుకు ఇది నిదర్శనమని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఈ ఘటన నిలువుటద్దమని నిప్పులు చెరిగారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ కార్యక్రమాన్నయినా అడ్డుకునే పోలీసులు చంద్రబాబు ఇంటి ముట్టడిని ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు.
పిచ్చి పరిపాలన చేసేవాడిని పిచ్చి తుగ్లక్ అని కాకుండా ఏమంటారని, రైతు సమస్యలపై మాట్లాడితే దౌర్జన్యం చేస్తారా..? అని మండిపడ్డారు.
శవాలపై చిల్లర పైసలు ఏరుకునే జోగి రమేష్… చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తారా..? అని మండిపడ్డారు. చెత్తపై పన్ను వేసినవారిని చెత్త పాలన అంటే తప్పా..? నిరంతరం బూతులు మాట్లాడే మంత్రిని బూతుల మంత్రి అనడం తప్పా..? అని తన వ్యాఖ్యలను రిపీట్ చేశారు.
చంద్రబాబు ఇంటి ముట్టడిపై నిన్నే సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా ఎందుకు భద్రత కల్పించలేదని నిలదీశారు. చంద్రబాబు హత్యకు కుట్ర పన్నుతున్నారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఉరితీయాలన్న జగన్పై కేసెందుకు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలను తిట్టినర బూతుల మంత్రి కొడాలి నానిని పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు.
తనను అరెస్టు చేసినా పరవాలేదని, నిజాలు నిర్భయంగా మాట్లాడతానని అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో గంజాయి వ్యాపారం చేసేది వైసీపీ నేతలేనని ఆరోపించారు. జగన్కు దమ్ముంటే డీజీపీని పిలిచి వార్నింగ్ ఇవ్వాలన్నారు. పాదయాత్రలో జగన్ కు ఎంత భద్రత కల్పించామో గుర్తు చేసుకోవాలన్నారు.
కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రిగా, సన్న బియ్యం అంటే తెలియని బూతుల మంత్రి.. కొడాలి నాని పౌరసరఫరాల మంత్రిగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టమని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడికి ముందస్తు ప్రణాళిక ప్రకారమే వైసీపీ కార్యకర్తలు వచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. వైసీపీ నేతలు తమపై దౌర్జన్యం, దాడి చేసి కొట్టారని ఆ దాడిలో తాను స్పృహ తప్పి పడిపోయానని చెప్పారు. జగన్ సర్కార్ దౌర్యన్యానికి ఇది పరాకాష్ట అని, తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. పోలీసులు కూడా వైసీపీ నేతలకే వత్తాసు పలికారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.