నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి రోజు సమావేశంలో 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాతో ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ ముగ్గురితో రేపు ప్రమాణం చేయించే అవకాశముంది. రేపు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి మొదలుకానున్నాయి.
ఇక, ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి అయ్యన్న మినహా మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. రేపు అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు, అయ్యన్నపాత్రుడి తరఫున కూటమి నేతలు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి అయ్యన్న పార్టీలోనే ఉన్నారు. 1983లో మొదటిసారి నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న..ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది.