వైసీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో అంటూ వైరల్ అవుతున్న ఒక వీడియో ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆ వీడియో తనది కాదని, టీడీపీ తనని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపూరితంగా ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని మాధవ్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆ వీడియో మార్ఫింగ్ వెనుక టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యపాత్రుడు పాత్ర కూడా ఉందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. తనకు ఆ మార్ఫింగ్ వీడియోతో ఎలాంటి సంబంధం లేదని ,మాధవ్ ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేసుకుంటారో, మరేమైనా చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు. వైసీపీ నేతల చేతిలో పోలీసులు, అధికారం ఉందని, తాను ఎటువంటి ఎంక్వయిరీకైనా రెడీ అని అయ్యన్న ఛాలెంజ్ చేశారు.
మరోవైపు, నందమూరి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై అయ్యన్న విరుచుకుపడ్డారు. నందమూరి కుటుంబం….జగన్‌లా దోచుకునే కుటుంబం కాదని అయ్యన్నపాత్రుడు చురకలంటించారు. గతంలోనూ పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని విష ప్రచారం చేసి…ఎన్నికలు పూర్తయిన తర్వాత అసలు పింక్ డైమండ్ లేదంటున్నారని అన్నారు.
వెబ్‌లో మాట్లాడినందుకే తనపై 14 కేసులు పెట్టారని, పబ్లిక్ గా మాట్లాడిన విజయసాయిపై ఎందుకు కేసు పెట్టడం లేదని అయ్యన్న నిలదీశారు. నందమూరి కుటుంబ సభ్యుల జోలికొస్తే.. 150 కాదు, ఒక్క సీట్ కూడా వైసీపీకి రాదని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుని చూసి వైసీపీ భయపడుతోందని, అందుకే ఇలాంటి పనులకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని అయ్యన్న ధ్వజమెత్తారు.