గెలిచిన తర్వాత పార్టీని వదలిపెట్టి పారిపోయేవారికి టికెట్లివ్వకూడదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గట్టిగా చెప్పారు. గ్రాడ్యుయేట్ల కోటాలో జరగబోయే ఎంఎల్సీ ఎన్నికల నోటీఫికేషన్ తొందరలో జారీ అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే మార్చి నెలలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడింటిలో ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి గ్రాడ్యుయేట్ల కోటాలో ఒక ఎంఎల్సీ ఎన్నికవ్వాల్సుంది. ఈ ఎన్నికలో ఎంపిక చేయాల్సిన అభ్యర్థి విషయంలోనే అయ్యన్న వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశంపార్టీ చాలాపెద్దపార్టీ కాబట్టి పై నుండి ఎవరో అభ్యర్ధిని తీసుకొచ్చి తమనెత్తిన రుద్ద వద్దని స్పష్టంగా చెప్పారు. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా ఈ మూడు జిల్లాల్లోని పార్టీ నేతల నుండే ఎంపికచేయాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పోయిన ఎన్నికల్లో మిత్రపక్షం అన్న కారణంగా బీజేపీ అభ్యర్ధికి మద్దతిచ్చి గెలిపించిన విషయాన్ని చింతకాయల గుర్తుచేశారు. పార్టీలో నేతలెవరు లేనట్లుగా బయట ప్రాంతాల నుండి నేతలను తీసుకొచ్చి రుద్దితే అంగీకరించేది లేదన్నారు.
బయట ప్రాంతాల వారిని లేదా బయట పార్టీల్లో నుండి వచ్చిన వారిని అభ్యర్ధిగా ఎంపిక చేస్తే సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ఇపుడు కూడా పార్టీలోని వ్యక్తిని ఎంపిక చేయకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుందని గట్టిగానే చెప్పరు. అయ్యన్న ఆందోళన చూస్తుంటే అభ్యర్ధి ఎంపికలో చంద్రబాబు నాయుడు బయట ప్రాంతానికి చెందిన నేతనో లేకపోతే ఇతర పార్టీలకు చెందిన నేతనో ఎంపిక చేయబోతున్నారా అనే అనుమానాలు పెరగిపోతున్నాయి. పనిలోపనిగా పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న నేతని మాత్రమే ఎంపికచేయాలి కానీ గెలవగానే పార్టీ నుంచి పారిపోయే నేతను కాదన్నారు.
అయ్యన్న ఆందోళన చూస్తుంటే అభ్యర్ధి ఎంపిక విషయం కష్టమనే అనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరైనా పార్టీ మారిపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు ? మూడు జిల్లాలకు చెందిన నేతనే అభ్యర్ధిగా ఎంపిక చేయాలనటం లో తప్పులేదు. అంతేకానీ పార్టీని వదిలి పారిపోకుండా ఉండేవారినే చూడాలంటే కష్టమే. నేతల ఆలోచనలు బయటకు కనబడవుకదా. కాబట్టి నమ్మకంతో పనిచేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. గెలిపించిన పార్టీలోనే ఉండటమన్నది నేతల నైతికతకు సంబంధించిన విషయమని అయ్యన్నకు తెలీదా ?