ఏపీతోపాటు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలు ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వారికి శాఖలను కేటాయించారు. కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ కేటాయించగా…పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి కేటాయించారు. ఇక, నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది.
మరోవైపు, తెలంగాణ నుంచి మోడీ 3.0 కేబినెట్ లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ అప్పగించగా…కరీంనగర్ నుంచి రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్ కు హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు అప్పగించారు. కాగా, కేరళలోని త్రిస్సూర్ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన ప్రముఖ నటుడు సురేశ్ గోపీకి టూరిజం సహాయ మంత్రిత్వ శాఖ కేటాయించారు. అయితే, సురేశ్ గోపీ షూటింగులతో బిజీగా ఉన్న నేపథ్యంలో మంత్రి పదవి వద్దన్నారని ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని సురేశ్ గోపీ సన్నిహితులు ఖండించారు.
ఇక, పీయూష్ గోయల్‌కు వాణిజ్యం, నితిన్ గడ్కరీకి రవాణాశాఖ, అమిత్ షాకు కేంద్ర హోంశాఖ, రాజ్ నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ, జైశంకర్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ, కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ, ధర్మేంద్ర ప్రదాన్‌కు మానవవనరుల శాఖ, జేపీ నడ్డాకు వైద్యం, భూపేంద్ర యాదవ్‌కు పర్యావరణం, మన్సుక్ మాండవీయకు కార్మిక శాఖ, క్రీడలు, జితిన్ రామ్‌కు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సీఆర్ పాటిల్‌కు జలశక్తి, చిరాగ్ పాశ్వాన్‌కు క్రీడలు, శరబానంద సోనోవాల్‌కు ఓడరేవులు, షిప్పింగ్, అన్నపూర్ణదేవికి మహిళా, శిశు సంక్షేమం, కిరణ్ రిజిజుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను అప్పగించారు