వైసీపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు.. వలంటీర్లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వారిని మరింత రెచ్చగొట్టే చర్యలకు ఆయన శ్రీకారం చుట్టారు. “మీకు రోషం.. పౌరుషం ఏమీ లేవా? మీకు ఆగ్రహం రావడం లేదా?“ అని వారిని ప్రశ్నించారు. అంతేకాదు.. ఇవి లేనప్పుడు.. మీరు వలంటీర్లుగా వేస్ట్ అని కూడా అనేశారు. ఇక, విషయం ఏంటంటే.. ఇటీవల వారాహి యాత్ర 2.0 సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వలంటీర్ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు.
హ్యూమన్ ట్రాఫికింకు వలంటీర్లు సహకరిస్తున్నారని కూడా అన్నారు. దీనిపై వలంటీర్లు ఆ మరుసటి రోజు కొన్ని జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశారు. అయితే.. ఇది వైసీపీ అధిష్టానానికి సరిపోయినట్టుగా లేదనే టాక్ వినిపిస్తోంది. ఇంతలోనే మంత్రులు రోజా, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు వంటి వారు మీడియా ముందుకు వచ్చి వరుసగా పవన్‌పై విరుచుకుపడ్డారు. వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. జోగి రమేష్ మరో అడుగు ముందుకు వేసి.. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే..అక్కడ వలంటీర్‌ను నిలబెట్టి ఓడిస్తామని కూడా శపథం చేశారు.
ఒకవైపు ఈ తరహా రాజకీయం జరుగుతుండగానే మరో వైపు.. అవంతి రెచ్చగొట్టే పాలిటిక్స్‌కు తెరదీశారు. తాజాగా ఆదివారం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వలంటీర్లపై విరుచుకుపడ్డారు. “మీకు పౌరుషం, రోషం ఉందా?“ అని ప్రశ్నించారు. “ఉంటే పవన్ మిమ్మల్ని అంతలేసి మాటలు అంటే.. మీరు దిష్టి బొమ్మలు తగలబెట్టి చేతులు ముడుచుకుని కూర్చుంటారా? ఇదేనా మీరు చేయాల్సింది. మీకు ఏం కాదు. మీరు ఏం చేయాలని అనుకుంటే అదే చేయండి. మీరు కూడా మనుషులేమనని నిరూపించండి. పవన్‌కు మీ ఎఫెక్ట్ అలా ఇలా తగల కూడదు“ అని రెచ్చగొట్టారు. మరి ఈ వ్యాఖ్యల ఫలితంగా వలంటీర్లు ఏమైనా చేస్తే.. కేసుల్లో ఇరుక్కుంటే ఎవరు రక్షిస్తారో .. అనే ప్రశ్నలకు మాత్రం మంత్రి సమాధానం చెప్పలేదు.