టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి, నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. ఇప్పటి వరకు సాగిన తీరు ఒక ఎత్తయితే.. ఇక నుంచి సాగబోయే తీరు మరో ఎత్తుగా ఉండడం ఖాయంగా కనిపిస్తోందని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాయలసీమ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు చెదురుమదురు ఘటన లు మినహా.. యాత్ర అత్యంత ప్రశాంతంగానే సాగిందని చెప్పాలి. ఒకటి రెండు సందర్భాల్లో పోలీసుల ఆంక్షల నేపథ్యంలో కొంత వివాదానికి దారి తీసింది.
అయితే, అనూహ్యంగా ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న యాత్రపై మాత్రం దాడులు జరగడం, రాళ్ల వర్షం కురిపించడం.. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. టీడీపీ కార్యకర్తలు, యువగళం వలంటీర్లను కూడా అరెస్టు చేయడం వంటివి పరిశీలిస్తే.. యువగళంపై అక్కసు స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేయడం, 50 మందిని అరెస్ట్ చేసి కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్కి తరలించడం మరింత వివాదానికి దారితీసింది.
మొత్తంగా పరిశీలిస్తే.. యువగళం పాదయాత్ర ముందుకు సాగకుండా మాస్టర్ ప్లాన్ ఏదో అమలు చేయాలనే కుట్ర సాగుతోందని టీడీపీ నాయకులు అనుమానిస్తుండడం గమనార్హం. గతంలో రైతులు అమరావతి రాజధాని కోసం పాదయాత్ర చేసినప్పుడు కూడా.. ఇదే తరహాలో అడ్డంకులు సృష్టించిన విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఉద్దేశ పూర్వకంగా అడ్డంకులు సృష్టించడంతోపాటు యాత్రను సైతం అడ్డుకున్నారు. ఇక, ఇప్పుడు ఇదే వ్యూహంతో యువగళం పాదయాత్రను కూడా అడ్డుకుంటున్నారనే చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది.