వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా వ్యవహరించిన సజ్జల రామకృష్నారెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయనే సర్వస్వం అన్నట్టుగా అప్పటి ప్రభుత్వంలో వ్యవహరించారు. ఇక, పార్టీ పరంగా కూడా దూకుడు ప్రదర్శించారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇప్పుడు భార్గవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా జగన్ సొంత జిల్లా కడపలోనే కావడం గమనార్హం.
కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం పోలీసులు.. సజ్జల భార్గవ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం గమనార్హం. హరి అనే దళిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు కట్టారు. హరి పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాడు. వైసీపీ నేతలు, ఈ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు, హరికి మధ్య ఆన్లైన్లో సంభాషణలు కూడా జరిగేవి. వైసీపీ యాక్టివిస్టులు పెట్టే పోస్టులకు మరి రిప్లయ్ ఇచ్చేవారు.
ఇలా.. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దూషణలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యం లో సజ్జల భార్గవరెడ్డి జోక్యం చేసుకుని హరిని వ్యక్తిగతంగా కులం పేరు పెట్టి దూషించారన్నది తాజాగా పోలీసులకు అందిన ఫిర్యాదు. స్వయంగా హరి ఈ ఫిర్యాదును అందజేయడంతో పోలీసులు సజ్జల భార్గవ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని కూడా కించపరిచారని, తనను కులం పేరుతో దూషించారని హరి మీడియాకు సైతం తెలిపారు. అందుకే ఫిర్యాదు చేశానన్నారు.
ప్రస్తుతం భార్గవ రెడ్డిపై కేసు నమోదైనా.. ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదు. 41 ఏ కింద నోటీసులు ఇచ్చేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నోటీసులకు సమాధానం చెప్పినతర్వాత.. ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.