ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని వైసీపీ నేతలు దుర్వినియోగపరుస్తున్నారని, సంఖ్యాబలం ఉంది కదా అని పవిత్రమైన అసెంబ్లీలో సైతం అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. సభలో సభ్యులు హుందాగా నడుచుకోవాలన్న సంగతి మరచిన వైసీపీ సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు రేగాయి. అయినప్పటికీ వైసీపీ నేతల తీరు మారడం లేదు. వైసీపీకి చెందిన ఓ మంత్రి పదే పదే….టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ మంత్రులపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొందరు మంత్రులు కుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబుపై కొందరు మంత్రులు నీచంగా మాట్లాడడం బాధాకరమని మండిపడ్డారు. ఆ మంత్రులకంటేట ఎక్కువగా మాట్లాడగలమని, కానీ సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, ఆ వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
విజయవాడలో నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీ మంత్రులపై అచ్చెన్న విరుచుకుపడ్డారు. తాము ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఓర్పు, సహనంతో ఉన్నామని, వాటిని కోల్పోతే వైసీపీ నేతలు రోడ్డుమీద తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. ఖబడ్దార్ మంత్రులారా, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే అభివృద్ధిపై చర్చకు రావాలని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.
రాజకీయాల్లో ఓనమాలు కూడా రాని వారు కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపైనే విమర్శలు చేస్తున్నారని, కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని పరోక్షంగా కొడాలి నానిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారిని మనిషనాలా? లేక ఇంకేమైనా అనాలా? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను దేవుడు కూడా క్షమించడని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.