గతంలో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ నుంచి లఢక్ లోని లేహ్ వరకు వెళ్లాలంటే రోడ్డు మార్గంలో సాగే ప్రయాణం నరకప్రాయం. రోహతాంగ్ పాస్ వైపు వెళ్లే లేహ్-మనాలీ హైవేపై సాగే ఈ ప్రయాణం మంచు కురుస్తున్న సమయంలో మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే, సంవత్సరంలో 4 నెలలపాటే ఈ మార్గం తెరిచి ఉంటుంది.
కాశ్మీరులోని జోజీ లా మీదుగా వెళ్లే శ్రీనగర్-ద్రాస్-కార్గిల్-లేహ్ హైవేపై నుంచి లడక్ కు మరోమార్గం ఉంది. ఇది కూడా సంవత్సరంలో 4 నెలలు మూసి ఉంటుంది. దీంతో, మనాలీ నుంచి లడక్ లోని లేహ్ కు వెళ్లడం ఆ ప్రాంత వాసులకు నరకప్రాయం. అయితే, ఇకపై వారికి ఈ ప్రయాణం నల్లేరు మీద నడక కానుంది.
వారి కష్టాలను తీర్చేందుకు మనాలీ నుంచి లాహోల్స్పిటి లోయ వరకు నిర్మించిన `అటల్ టన్నెల్`ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన టన్నెల్ ను జాతికి అంకితం చేశారు మోడీ.
ఆ ప్రాంత వాసుల కష్టాలను తీర్చేందుకు రోహతాంగ్ పాస్ కింద రూ.3,500 కోట్ల ఖర్చుతో… 9.02 కిలోమీటర్ల పొడవుగా ఈ టన్నెల్ ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున ఈ టన్నెల్ ఉంది.
ఈ టన్నెల్ 8 మీటర్ల వెడల్పు, 5.525 మీటర్ల ఎత్తు కలిగి ఉండగా…లోపల రెండు వరుసల హైవే ఉంది. ఆస్ట్రియా టన్నెలింగ్ విధానంలో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించిన ఈ టన్నెల్ ద్వారా మనాలీ నుంచి లఢక్ లోని లేహ్ వరకు ఉన్న ప్రయాణ సమయంలో 7 గంటలు ఆదా చేయవచ్చు. దీంతో పాటు, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
సొరంగ మార్గంలో మంచు కురుస్తుందన్న భయంలేకుండా సంవత్సరం పొడవునా ఈ టన్నెల్ ద్వారా ప్రయాణించవచ్చు. లఢక్, అక్సాయ్ చిన్ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు ఈ టన్నెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆలోచనలలోనుంచి పురుడుపోసుకున్న ఈ టన్నెల్ కు 2002 మే 26న శంకుస్థాపన జరిగింది. గత ఏడాది డిసెంబరులో వాజపేయి 95వ జయంతి సందర్భంగా దీనికి ‘అటల్ టన్నెల్’ అని పేరు పెట్టారు.