గతాన్ని తలుచుకొని సంతోషించటమే తప్ప వర్తమానంలో చేస్తున్నది లేదు. భవిష్యత్తులో అయినా పరిస్థితులు మారతాయా? అన్న సందేహంతో కిందా మీదా పడుతోంది కాంగ్రెస్.
గెలుపు ఓటములు కాంగ్రెస్ కు కొత్త కానప్పటికి.. గడిచిన ఎనిమిదేళ్లుగా ఎదురవుతున్న పరిస్థితులు.. చోటు చేసుకుంటున్న పరిణామాలు.. గతంలో ఎదురుకాలేదంటున్నారు.
అన్నింటికి మించిన నరేంద్ర మోడీ లాంటి ప్రత్యర్థి కాంగ్రెస్ కు ఎదురుకావటం ఇదే తొలిసారి అని చెప్పక తప్పదు.
అది కూడా.. పార్టీ పెద్దదై.. సమర్థనేతలంతా పార్టీని విడిచి వెళ్లిన వేళలో ఎంట్రీ ఇచ్చిన మోడీ.. పార్టీ ఉనికే ప్రమాదకరంగా మార్చేసిన పరిస్థితి. ఇలాంటివేళ.. పార్టీకి సమర్థుడైన వ్యక్తికి పగ్గాలు అందించాలని గాంధీ ఫ్యామిలీ కోరుకొంటోంది.
కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబమే తప్పించి మరొకరు గుర్తుకు రారు. అలా రాకుండా చేయటంలో సక్సెస్ అయిన గాంధీ ఫ్యామిలీకి ఇప్పుడు అదే గుదిబండగా మారిందని చెప్పాలి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి మీద రాహుల్ కు ఆసక్తి లేకపోవటం.. ప్రియాంక సిద్ధంగా లేకపోవటం.. సోనియమ్మకు ఆరోగ్యం సహకరించకపోవటం లాంటి కారణాలతో.. ఎవరైనా సీనియర్ నేతకు.. విధేయుడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చేస్తున్న కసరత్తుఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అపారరాజకీయ అనుభవం.. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడైన అశోక్ గెహ్లాత్ కు అప్పజెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లోపార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చినప్పటి నుంచి ఆ పదవికి దూరంగా ఉంటున్నారే కానీ.. దాన్ని చేపట్టేందుకు ఆయన అస్సలు ఆసక్తి చూపటం లేదు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో నాయకత్వ లేమి పార్టీని వెంటాడుతోంది.
దీంతో.. అధ్యక్షుడిగా సమర్థుడైన నేతను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటివేళ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అశోక్ గెహ్లాత్ ను ఢిల్లీకి పిలిపించిన అధినాయకత్వం.. టెన్ జన్ పథ్ లో ఆయనతో కీలక చర్చలు జరిపారు.
పార్టీ పగ్గాలుస్వీకరించాలని ఆయనకు సూచన చేసినట్లు చెబుతున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రాహుల్.. ప్రియాంకలతో కలిపి సోనియాగాంధీ విదేశాలకు వెళ్లటం గమనార్హం.
అయితే.. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఆయన తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయాల్సి ఉంది.
ఆ విషయంలో ఆయన సుముఖంగా లేరని చెబుతున్నారు. అయితే.. అశోక్ గెహ్లాత్ కనుక సీఎం పదవికి రాజీనామా చేస్తే.. ఆయన స్థానంలో ఆ కుర్చీలో కూర్చోవటానికి సచిన్ పైలట్ సిద్ధంగా ఉండటంతో.. రాజస్థాన్ కు సంబంధించిన రచ్చ ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
అయితే.. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అశోక్ గెహ్లాత్ అంత సుముఖంగా లేరంటున్నారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడి బాధ్యత చేపట్టి.. భిన్న ధ్రువాల్ని ఒకటిగా చేసే క్లిష్టమైన బాధ్యత కంటే.. స్వతంత్య్రంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారాన్నిచెలాయించటమే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
పేరుకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నా.. వ్యవహారాలు.. నిర్ణయాలన్నిగాంధీ కుటుంబమే తీసుకుంటుందన్న విషయం బహిరంగ రహస్యం.
ఆ మాత్రం దానికి పవర్ లేని పదవిలో ఉండటం అవసరమా? అన్న ఆలోచన ఆయనకు ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 28న అంటే ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశం కానుంది.
గాంధీ కుటుంబం మొత్తం గైర్హాజరీ వేళ జరిగే ఈ భేటీలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే.. గహ్లాత్ కు పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి లేని పక్షంలో అంబికా సోనీ.. మల్లికార్జున్ ఖర్గే.. మీరాకుమార్.. కేసీ వేణుగోపాల్.. ముకుల్ వాస్నిక్ లాంటి పేర్లు వినిపిస్తున్నా.. వారెవరూ అశోక్ గహ్లాత్ కు రిప్లేస్ చేసే స్థాయి లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.