అశోక్ గజపతిరాజు పరువు తీయాలనుకున్నారు
సాధ్యం కాలేదు
అశోక్ గజపతిరాజు బురద జల్లుదాం అనుకున్నారు
అశోక్ గజపతిరాజును జైలుకు పంపుదాం అనుకుంటున్నారు
అది కూడా సాధ్యం కాదు
తాజాగా ట్రస్టు వ్యవహారాలపై ఏపీ సర్కారు వేసిన విచారణ కమిటిీల్లో ఏమి తేలుతుందో కూడా అందరు సులువుగా ఊహించేయగలుగుతున్నారు. అశోక గజపతిరాజుపై ఎంత బురద జల్లే ప్రయత్నం చేస్తే అంత అవమాన పడాల్సి వస్తుందని స్థానికుల్లో చర్చ జరుగుతుంది.
ఎవరైనా తాము ఇచ్చిన భూముల్లో తాము అవినీతి చేస్తారా… ఇంత చిన్న లాజిక్ తెల్వదా మీకు అంటున్నారు జనం.
ఓడుతాం అని తెలిసిన ఏ లాయర్లను మేపాలని ఈ ప్రయత్నమో అర్థం కాని పరిస్థితి అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
మొత్తానికి ఉత్తరాంధ్ర రాజకీయాన్ని కంపు చేసుకుంటోంది వైసీపీ. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం లేదని పార్టీ నేతలే భావిస్తున్నారు.
అసలు ఈ స్టోరీ హిస్టరీ తవ్వితే మరింత క్లారిటీ వస్తుంది చదువుదాం పదండి…
తన ఆస్తులు, వ్యాపారాలపై సీబీఐ దర్యాప్తునకు, అక్రమ కేసుల్లో చార్జిషీట్ల దాఖలుకు కారకుడని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై సీఎం జగన్మోహన్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని రుజువయింది.
ఉత్తరాంధ్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన, వేలకోట్ల ఆస్తులున్న ‘మాన్సాస్’ ట్రస్టు భూములపైన, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూములపైన కన్నేసిన ప్రభుత్వ పెద్దలు… అశోక్‌ను ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తొలగించి.. సంచయిత గజపతిరాజును నియమించిన సంగతి తెలిసిందే.
అయితే అశోక్‌ను మాన్సాస్ ట్రస్టు నుంచి తప్పిస్తూ… దాని వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ గజపతిరాజు, ఆర్వీ సునీతప్రసాద్‌ను గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. మాన్సాస్ ట్రస్టుతోపాటు సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కొట్టివేసింది.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 71, 72, 73, 74 జీవోలను రద్దు చేసింది. అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సింహాచలం దేవస్థానం వంశపారంపర్య చైర్మన్‌గా పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.
ఆయన నియామకానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. దీంతో ట్రస్టు నిబంధనల ప్రకారం సింహాచలం ఆలయానికి, మాన్సాస్ ట్రస్టుకు తిరిగి ఆయన చైర్మన్ అయ్యారు. దీంతో నిరాశానిస్పృహలకు గురైన ప్రభుత్వం.. ఆయన్ను అవమానించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.
దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ఆయన వెళ్తే కనీసం ఈవో గానీ, ఆలయ సిబ్బంది గానీ రాలేదు. అర్చకులూ ముఖం చాటేశారు. ట్రస్టు ఆస్తులపై ఆడిటింగ్‌కు ఆదేశాలు జారీచేశారు. అశోక్ 500 ఎకరాల ట్రస్టు భూములు కాజేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత ఆరోపణలు చేశారు.
నిగర్వి, నిరాడంబరుడు, నిజాయితీపరుడైన అశోక్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు కూడా తప్పుబడుతున్నారు.
అధికారుల అత్యుత్సాహం..
నిజానికి ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి ప్రోద్బలంతో దేవదాయశాఖ మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శించింది. 1958లో మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ఏర్పాటు సమయంలోనే దాని వ్యవస్థాపకులు పీవీజీ రాజు తర్వాత ట్రస్టుకు ఎవరు చైర్మన్‌గా ఉండాలనే దానిపై డీడ్ రాశారు.
దాని ప్రకారం ఆయన తర్వాత వారి కుటుంబంలోని పెద్దలైన పురుషులు ఆ బాధ్యతలు చేపట్టాలని స్పష్టంగా ఉంది. దానిని అనుసరించే పీవీజీ రాజు తర్వాత పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు మాన్సాస్ ట్రస్టుకు, సింహాచలం ఆలయానికి చైర్మన్ అయ్యారు.
2016లో ఆయన మరణించాక, ఆయన సోదరుడైన అశోక్ ఆ బాధ్యతలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం నిరుడు మార్చి 20న కొత్త ట్రస్టు బోర్డును ఏర్పాటుచేసి, అందులో ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత పేరును చేర్చింది. అనంతరం మార్చి 3న ఆమెతోపాటు ఆ కుటుంబంలోని మరో ఇద్దరిని ట్రస్టు ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులుగా గుర్తిస్తూ జీవో 72 జారీచేసింది.
అనంతరం మాన్సాస్ ట్రస్టుకు, సింహాచలం ఆలయానికి ఆమెను చైర్మన్‌గా నియమించింది. ట్రస్టు డీడ్ ప్రకారం కుటుంబంలో పెద్దలైన పురుషులే చైర్మన్‌గా ఉండాలని నిబంధనలు చెబుతున్నా పట్టించుకోలేదు.
అనంతరం కొద్ది కాలానికి ట్రస్టు పరిధిలో పలు జిల్లాల్లో ఉన్న చిన్న ఆలయాలకూ అశోక్‌ను తొలగించి, సంచయితను చైర్మన్‌ను చేసింది. విజయనగరంలోని రామతీర్థంలో విగ్రహ ధ్వంసం సాకు చూపి, అక్కడా చైర్మన్‌గా ఉన్న అశోక్‌ను తొలగించింది. ఇలా నిబంధనలు పక్కనపెట్టి ఇచ్చిన జీవోలన్నీ ఇప్పుడు రద్దయ్యాయి.
సంచయితను వ్యవస్థాపక కుటుంబ సభ్యురాలిగా నియమిస్తూ జారీచేసిన జీవోను కొట్టివేయడంతో అందుకు అనుగుణంగా ఇచ్చిన జీవోలన్నీ రద్దయిపోయాయి.
నియామకంలో అనేక వివాదాలు..
సంచయిత నియామకంలో అనేక వివాదాలు ఏర్పడ్డాయి. ట్రస్టు డీడ్ ఉల్లంఘన ఒకటి అయితే, ఆమె ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె అని, వారు విడాకులు తీసుకోవడంతో ఆమెకు కుటుంబంతో సంబంధం లేదనే వాదన తెరపైకి వచ్చింది.
అసలు వంశపారంపర్యంగా ఆ హక్కులు తమకు వస్తాయంటూ ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె కూడా కోర్టును ఆశ్రయించారు. సంచయిత చర్చిలకు వెళ్తారని, ఆమె హిందువే కాదనే ఆరోపణలు వచ్చాయి.
అయినా వైసీపీ ప్రభుత్వం లెక్కచేయలేదు. సింహాచలం, మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచయితపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె ఎక్కడో ఉంటూ సింహాచలం కొండపై ఓ వ్యక్తిని పెట్టి, అతడి ద్వారా ఆలయ పాలన సాగించాలని ప్రయత్నాలు చేశారు.
ఈ విషయంలో అధికారులకు, సంచయితకు మధ్య వివాదం కూడా ఏర్పడింది. దీంతో అక్కడ పనిచేసిన పలువురు అధికారులు తమను బదిలీ చేయాలని దేవదాయశాఖ ఉన్నతాధికారులు లేఖలు కూడా రాశారు.
మాన్సాస్ ట్రస్టు ఈవోగా నెలల వ్యవధిలోనే పలువురు మారారు. ట్రస్టు పరిధిలో తూర్పుగోదావరిలో ఉన్న ఆలయాల భూముల్లో ఉన్న ఇసుక వేలం విషయంలోనూ సంచయిత జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు వచ్చాయి.
ప్రభుత్వ వెబ్సైట్లో జీవోలు మాయం..
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సంచయితను ఫౌండర్ ఫ్యామిలీ సభ్యురాలిగా గుర్తిస్తూ ఇచ్చిన జీవో, సింహాచలం, మాన్సాస్ ట్రస్టులకు చైర్మన్‌గా నియమిస్తూ ఇచ్చిన జీవోలను అధికారిక వెబ్సైట్ నుంచి ప్రభుత్వం తొలగించింది. కోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆ జీవోలు మాయమవడం విశేషం.