నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. రఘరామపై రాజద్రోమం కేసు పెట్టిన సీఐడీ అధికారులు….ఆయనను అరెస్టు చేయడం కలకలం రేపింది. రఘురామ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత రఘురామకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మేజిస్ర్టేటు ఆదేశాలు జారీ చేశారు. మే 28న తిరిగి కోర్టు ముందు హాజరుపరచాలని రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు, కస్టడీలో ఉన్న రఘురామపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు రావడం పెనుదుమారం రేపుతోంది. ఈ విషయంపై రఘురామ స్వయంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. రఘురామ ఆరోగ్య పరిస్థితి, థర్డ్ డిగ్రీ నేపథ్యంలో శనివారం రాత్రి పోలీసులు ఆయనను జీజీహెచ్‌కు తరలించారు. రఘురామకు కస్టడీలోనే దెబ్బలు తగిలాయని తేలితే చర్యలు తీసుకుంటామని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే రఘురామ కేసులో మెడికల్ బోర్డును సీఐడీ కోర్టు తాజాగా ఏర్పాటు చేసింది. మెడికల్ బోర్డు హెడ్‌గా గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి నియమితులయ్యారు. సభ్యులుగా మరో ముగ్గురు వైద్యులను నియమించారు. హెడ్ ఆఫ్ ది జనరల్ మెడిన్ డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ సుబ్బారావులు ఈ బోర్డులో ఉన్నారు.
మరోవైపు, సుప్రీం కోర్టులో రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణ రావు శనివారం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణలో భాగంగా రఘురామను పోలీసులు తీవ్రంగా హింసించారని పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టులో రఘురామ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వాదించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.