ఢిల్లీలో మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది.
హిందూ సేనకు చెందిన కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.
కాగా ఈ దాడిలో ఆయన నివాసం పాక్షికంగా ధ్వంసమైంది. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఒవైసీ ఇంటిపై ఈ దాడి జరిగింది.
దాడికి పాల్పడిన ఐదుగురు హిందూ సేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని అక్కడి డీసీపీ దీపక్ యాదవ్ తెలిపారు.
కాగా తన నివాసంపై జరిగిన దాడిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. గూండాలను రెచ్చగొట్టి తన ఇంటిపై దాడి చేయించారని ఆయన వరుస ట్వీట్లు చేశారు.
దేశ రాజధానిలో ఒక ఎంపీ నివాసం సురక్షితంగా లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఇంకా ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
‘‘నేను లేని సమయంలో ఢిల్లీలో గూండాలు ఆయుధాలతో గుంపులుగా వెళ్లి, నా ఇంటిపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో నా ఇంటి కాపలాదారు గాయపడ్డాడు. దాడులతో భయపెట్టలేరు. మజ్లిస్ అంటే ఏమిటో ఆ గూండాలకు తెలీదు’’ అని ఒవైసీ అన్నారు.
‘‘నేను లేని సమయం చూసుకుని నా ఇంటిపై దాడి చేశారు. వారికి అలవాటైనట్లుగానే గుంపుగా వచ్చి దాడి చేశారు’’ అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
గొడ్డళ్లు, కర్రలతో వచ్చి దాడి చేశారని, రాళ్లు విసిరారని, తన నేమ్ ప్లేట్ పగిలిపోయిందని అసద్ చెప్పారు.
గత 40 ఏళ్లుగా తన ఇంటికి కేర్ టేకర్‌గా వ్యవహరిస్తున్న రాజుపైనా దాడి చేశారని, మతతత్వ నినాదాలు చేస్తూ నన్ను చంపేస్తామని బెదిరించారని… ఇదంతా చూసి అక్కడున్న రాజు మనమలు భయంతో వణికిపోయారని అసద్ తన ట్వీట్లో రాశారు.
మొత్తం 13 మంది వచ్చారని, రాజు ఫిర్యాదు చేయడంతో అందులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని అసద్ చెప్పారు.
తనపై ఇంటిపై దాడి జరగడం ఇది మూడోసారని… దేశ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంటి పక్కనే తన ఇల్లు కూడా ఉంటుందని… పార్లమెంట్ వీధి పోలీస్ స్టేషన్ కూడా అక్కడికి చాలా దగ్గరని అసదుద్దీన్ చెప్పారు.