ఏపీలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై హైకోర్టు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు తాజాగా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సీనియర్ అధికారి, ఏపీ ఆర్ధిక శాఖ కార్మదర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విద్యా శాఖ బిల్లుల చెల్లింపు అంశంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, విద్యాశాఖప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ , విద్యాశాఖ కార్యదర్శి సురేష్‌కుమార్ హాజరయ్యారు. సత్యనారాయణ గైర్హాజరయ్యారు.
విద్యాశాఖ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని సీనియర్ న్యాయవాది అంబటి సుధాకర్ రావు వాదనలు వినిపించారు. గైర్హాజరైన సత్యనారాయణకు హైకోర్టు న్యాయవాది జస్టిస్ బట్టుదేవానంద్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. విద్యాశాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు.. మంగళవారం కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, కొందరు అధికారులు కోర్టుకు హాజరయ్యారు. కానీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ మాత్రం హాజరుకాలేదు.
అసలు ఏం జరిగింది?
విద్యాశాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపు జాప్యం మీద కార్వే మేనేజ్ మెంట్ డేటా లిమిటెడ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు రావాల్సిన బిల్లులు ఆలస్యం చేస్తున్నారు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వెంటనే తమకు బిల్లులు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కార్వే సంస్థ తన పిటిషన్ లో కోరింది.
దీని విచారణకు సంబంధించి ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ విచారణకు రావాల్సి ఉంది. కానీ ఆయన రాలేదు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు.. సత్యనారాయణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సత్యనారాయణను కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. బిల్లుల జాప్యానికి సంబంధించి గతంలో హైకోర్టు పలు మార్లు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా ఆర్థికశాఖ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.