స్థానిక ఎన్నికలకు సంబంధించి రేపు ఏపీలో కీలక బేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలా వద్దా అన్న విషయమై రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ఉంది. ఈ అఖిలపక్ష సమావేశాన్ని రేపు ఉదయం 10.40 నిమిషాలకు తలపెట్టారు.
ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయాలు, సూచనలను ఎన్నికల సంఘం తీసుకోనుంది. అయితే, ఈ సమావేశం ఇపుడు పెట్టడానికి కారణం… హైకోర్టు ఎన్నికలు జరపాలా ? వద్దా? తేల్చండి అంటూ ఈసీకి నోటీసులు ఇచ్చింది. పార్టీలతో మాట్లాడి చెబుదామని నిమ్మగడ్డ మీటింగ్ పెట్టారు.
అయితే లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే..రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొంది. మరి కోర్టు ఏం చెబుతుందో ఉదయానికల్లా తెలుస్తుంది.
ఇదిలా ఉండగా… ఈ సమావేశానికి టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ నుంచి షేక్ మస్తాన్ వలి, బీజేపీ తరపున పాక సత్యనారాయణ, సీపీఐ నుంచి రామకృష్ణ హాజరవుతారు. వైసీపీ, జనసేన, సీపీఎం నుంచి కూడా వస్తారు. కానీ ప్రతినిధుల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు.
మరో వారం రోజులో ఏపీలో స్కూళ్లు తెరిచి పిల్లలకు పాఠాలు చెబుతున్న ప్రభుత్వం… ఓటు వేయడానికి మాత్రం కరోనా కారణం చెప్పడంతో అడ్డంగా బుక్కయిపోయింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది. ఎన్నికల నిర్వహణకే మెజార్టీ పార్టీలు మొగ్గు చూపుతుండగా… అధికార వైసీపీ మాత్రం వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఆర్నెల్లలో నిమ్మగడ్డ రిటైరవుతారు. ఆ తర్వాత ఎన్నికలు పెడదాం అన్నది వైసీపీ సర్కారు ఆలోచన.