ఏపీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ సహా కొన్ని పార్టీలు ఉచిత హామీలను విచ్చలవిడిగా ఇస్తుంటాయి. తమను గెలిపిస్తే అది ఉచితంగా ఇస్తాం… ఇన్ని డబ్బులు ఖాతాలో వేస్తాం అంటూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. అయితే, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతోందని, ఈ వ్యవహారంపై ఫోకస్ చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
ఉచిత పథకాల వల్ల రాష్ట్రాలు అప్పులపాలవుతున్నాయని, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిని కొన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీల సందర్భంగా ఇచ్చే ఉచిత పథకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…టైం బాంబులుగా అభివర్ణించింది. ఏ ప్రభుత్వం అయినా ప్రకటించే సంక్షేమ పథకాల ఖర్చు ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఒక శాతం మించకూడదని ఎస్ బీఐ అభిప్రాయపడింది.
ఈ క్రమంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో అందిస్తున్న ఉచిత పథకాలపై ఎస్ బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి అందించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వాలు సేకరించిన బడ్జెటేతర అప్పుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉండడం షాకింగ్ గా మారింది.
ఈ జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అయితే, తక్కువ లీకేజీలతో అమలు చేసే కొన్ని ఉచిత పథకాలు పేదలకు లబ్ధి చేకూరుస్తాయని, స్వయం సహాయక బృందాలకు వడ్డీ రాయితీ ఇందుకు ఉదాహరణ అని సౌమ్య అభిప్రాయపడ్డారు. అయితే, ఉచిత కరెంటు, ఉచిత త్రాగునీరు, స్మార్ట్ ఫోన్లు, ఉచిత ల్యాప్ టాప్ లు, రైతు రుణమాఫీ వంటి హామీలు సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ హామీలను పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో అమలు చేస్తున్నానని నివేదికలో పేర్కొన్నారు.