ఏపీ లో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి.. 3396 మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించాలని కూటమి సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త దుకాణాల కోసం అక్టోబర్ 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… దరఖాస్తుల గడువు అక్టోబర్ 9తో పూర్తి కావాల్సి ఉంది. కానీ దరఖాస్తుదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువును రెండు రోజులు అంటే అక్టోబర్ 11 వరకు పొడిగించింది. శుక్రవారం రాత్రి 7 గంటలతో ఆ గడువు పూర్తైంది.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు.. ఏకంగా 89,643 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున… ఏపీ ప్రభుత్వానికి రూ.1700 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. అత్యధిక దరఖాస్తులు వచ్చిన జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ జిల్లాలో మద్యం షాపులకు భారీ పోటీ నెలకొంది. 113 మద్యం షాపులకు ఏకంగా 5787 దరఖాస్తులు అందాయి. అంటే ఒక్కో షాపునకు సగటున 51 మంది పోటీ పడుతున్నారు.
ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ పోటీ ఏర్పడింది. జిల్లాలో 175 వైన్స్ షాప్స్ ఉండగా.. 5362 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి జిల్లా నుండి అత్యల్పంగా 1179 దరఖాస్తులు అందాయి. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో కూడా చాలా షాపులకు దరఖాస్తులు రెండంకెల సంఖ్య కూడా చేరలేదు. ఇకపోతే అక్టోబర్ 14వ తేదీన లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేస్తారు. 3396 షాపులకు వేర్వేరుగా కలెక్టర్ల సమక్షంలో లాటరీలు తీస్తారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త లైసెన్సు దారులు 16వ తేదీ నుంచి మద్యం దుకాణాలను ప్రారంభించుకోవచ్చు. రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షలు వరకు లైసెన్స్ ఫీజులను నిర్ణయించారు.