కరోనా సెకండ్ వేవ్ పలు ప్రపంచ దేశాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్ వంటి దేశాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ లోని మెజారిటీ కేసుల్లో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో దేశవ్యాప్తంగా పల్స్ ఆక్సిమీటర్లు, స్మార్ట్ వాచ్ లు, ఆక్సిజన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కరోనా అనుమానితులు పల్స్ ఆక్సి మీటర్లో ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన ‘కేర్ నౌ హెల్త్‌కేర్’ అనే స్టార్టప్ సంస్థ అరచేతిలో ఆక్సిమీటర్ ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్లోని ఒక యాప్‌తో శరీరంలోని ఆక్సిజన్ స్థాయి, పల్స్, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ఓ అద్భుతమైన యాప్ ను ఆవిష్కరించింది. ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ పనిచేస్తుంది. సాధారణంగా ఆక్సీమీటర్ ఇన్ఫ్రారెడ్ లైట్ సెన్సార్ల ఆధారంగా పనిచేస్తుంది. కానీ ఈ యాప్‌లో కేవలం మన ఫోన్లోని ఫ్లాష్ ఆధారంగా ఆక్సిజన్ స్థాయిని తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.
ఈ యాప్‌ను ఓపెన్ చేసి మన ఫోన్ ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి వెనుక ఉన్న రేర్ కెమెరాపై మన వేలిని ఉంచాలి. ఆ తర్వాత యాప్ లో స్కాన్ బటన్‌ను ప్రెస్ చేయగానే నలభై సెకన్లలో ఆక్సిజన్, పల్స్, శ్వాసక్రియ రేట్లను యాప్ చూపిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు కేర్‌నౌ హెల్త్‌కేర్ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్ వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ లో ఈ యాప్ 96 శాతం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ఈ యాప్ ప్రస్తుతం ఐవోఎస్ యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వెబ్సైట్లో ఏపీకేను అందుబాటులోకి తెచ్చారు.
త్వరలోనే యాండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్‌లోకి యాప్ ను అందుబాబులోకి తేబోతున్నట్టు తెలుస్తోంది. సింగిల్ యూజర్ వినియోగానికి ఉచితంగా ఈ యాప్ సేవలు అందిస్తున్నారు. అంతకుమించి సేవలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కేర్‌నౌ వెబ్సైట్లో ఈ యాప్ నకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.