ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ టీడీపీ అధ్యకుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ను నియమించిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో టీడీపీని తిరుగులేని శక్తిగా మార్చడంలో పల్లా శ్రీనివాసరావు కీలక పాత్రను పోషించారు. గత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కీలక నేతగా మారారు. 2024 ఎన్నికల్లో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా గాజువాకలో పోటీ చేసిన పల్లా బంపర్ మెజారిటీతో గెలిచారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఏకంగా 95,235 ఓట్ల మెజారిటీతో ఓడించారు. రాష్ట్రంలో పల్లాదే అత్యధిక మెజారిటీ కావడం మరో విశేషం. ఇక ఎన్నికలకు ముందు వరకు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన పల్లా శ్రీనివాస్ యాదవ్ ను.. ఎన్నికల తర్వాత ఏకంగా రాష్ట్ర టీడీపీ అధ్యకుడిగా చంద్రబాబు నియమించారు. అయితే విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పల్లా శ్రీనివాసరావు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ఆపై మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ రాష్ట్ర అధ్యకుడిగా, గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలో అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి పని చేస్తానని పల్లా తెలిపారు. అలాగే అధికారంలో ఉన్నామనే అహాకరంతో ప్రజాస్వామానికి విఘాతం కలిగించే పనులు చేయవద్దంటూ పార్టీ నేతలకు సూచన చేశారు. ఇక గత వైకాపా పాలనను పల్లా దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోక పోవడం వల్లే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారని సెటైర్లు వేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వారి లెక్కలు తేలాస్తామని పల్లా వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.