నిమ్మాడలో వైసీపీ బలపరిచిన అభ్యర్థిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెదిరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టయిన అచ్చెన్నకు నిన్న సాయంత్రం సోంపోట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే నేడు అచ్చెన్న జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన అచ్చెన్న కొంత భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతున్న అచ్చెన్న…ఉన్నపళంగా కన్నీటిపర్యంతమయ్యారు.
తాను ఎలాంటి తప్పు చేయకున్నా, తనకు సంబంధం లేని విషయంలో అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, తాను ఫోన్ లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి అప్పన్నను బెదిరించినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని అచ్చెన్న సవాల్ విసిరారు. అప్పన్న సోదరుడు కోరినందునే తాను అప్పన్నకు ఫోన్ చేశానని, ఆ కాల్ రికార్డు చేసి ఫిర్యాదు చేశారని తెలిపారు.
వైసీపీకి, జగన్ కు కింజరపు కుటుంబం గుదిబండలా తయారైందని, సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనకుంటున్నారని జగన్ సర్కార్ పై అచ్చెన్న ధ్వజమెత్తారు. జైలు నుంచి విడుదలైన అచ్చెన్నకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అచ్చెన్నాయుడు నిమ్మాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అచ్చెన్న వెంట ఆయన సతీమణి, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.
మరోవైపు, అచ్చెన్నకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి ఆయనకు బాసటగా నిలిచారు. జగన్ సర్కార్ పై అచ్చెన్న చేస్తోన్న పోరాటం అభినందనీయమని, జగన్ సర్కార్ చర్యలపై పోరాటాన్ని కొనసాగిద్దామని ఆయన చెప్పారు. జగన్ సర్కార్ పై పోరాటంలో అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు. ఏపీలో బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న జగన్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు అన్నారు. జగన్ సర్కారు అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడుపై కక్ష సాధింపు చర్యలకు జగన్ పాల్పడుతున్నారని ఆరోపించారు.