వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. అచ్చెన్నకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సోంపేట అదనపు జిల్లా కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తాజాగా పోలింగ్ కు ముందు రోజు అచ్చెన్నకు సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అచ్చెన్నకు రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే రేపు అచ్చెన్నతోపాటు వారంతా జైలు నుంచి విడుదల కానున్నారు. పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అచ్చెన్న విడుదల ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు సతీమణి నామినేషన్ వేశారు. అయితే, ఆమెకు పోటీగా అచ్చెన్న సోదరుడి కుమారుడైన కింజరాపు అప్పన్నను వైసీపీ నేతలు ఉసిగొలిపి నామినేషన్ వేయించారన్న ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే అప్పన్నతో అచ్చెన్న ఫోన్ చేసి మాట్లాడారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ అచ్చెన్న తనను బెదిరించారని అప్పన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కోటబొమ్మాళి పీఎస్ లో కేసు నమోదు కాగా, అచ్చెన్నతోపాటు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత అచ్చెన్నకు 16 రోజుల రిమాండ్ విధించగా…తాజాగా ఆయనకు బెయిల్ లభించింది.
అయితే, నిమ్మాడలో ఆయుధాలతో వీరంగం వేసిన టెక్కలి వైసీపీ ఇన్ చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ను వదిలేసి, అచ్చెన్నను అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజును పోలీసులు అరెస్టు చేసి వెంటనే స్టేషన్ బెయిల్ పై విడుదల చేయడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ విమర్శలన నేపథ్యంలో తాజాగా అచ్చెన్నకు బెయిల్ లభించిందన్న టాక్ వస్తోంది.