గతంలో జర్నలిస్టు అంటే అతనికి ఓ విజ్జత, పరిజ్జానం ఉండేది. ఇపుడు జర్నలిస్టుల్లో అసలు జర్నలిజంపై కనీస అవగాహన లేనట్టు పదేపదే నిరూపితం అవుతోంది. వార్తను వార్తలా ఇవ్వలేకపోతున్నారు. వార్తలో సొంత అభిప్రాయాలు ఎక్కువైనాయి. వార్తలో ప్రధాన విషయం ఏంటో కనిపెట్టే శక్తి జర్నలిస్టుల్లో సన్నగిల్లింది.
ఒకపుడు రాజకీయ నాయకులు జర్నలిస్టుల వద్ద గౌరవంగా నడుచుకునేవారు. ఇపుడు రివర్స్ అయ్యింది. సార్ సార్ అంటూ నాయకుల వెంట పడుతున్నారు జర్నలిస్టులు.
ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారాం కారు అదుపు తప్పి ఒక ఆటోను గుద్దింది. అదేమో బలమైన కారు. వారు డీకొట్టేందేమో మూడు చక్రాల ఆటోను. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. స్పీకర్ గారి కారు బంపర్ స్వల్పంగా దెబ్బతింది. ఇంతవరకూ ఓకే.
స్పీకర్ గారికి పెను ప్రమాదం తృటిలో తప్పిందట. అందరూ ఊపిరి పీల్చుకున్నారట. ఇలా టీవీల్లో స్క్రోలింగ్ వేస్తున్నారు.
అసలు కారు, ఆటో గుద్దుకుంటే ఉపిరిపీల్చుకోవాల్సింది కారులో ఉన్నవాళ్ళా, ఆటోలో ఉన్నవాళ్ళా?కారులో ఉన్నవాళ్ళవే ప్రాణాలా? ఆటోలో ఉన్న ప్రయాణీకులవి ప్రాణాలు కావంటారా?
ఏమిటీ అరాచక రాతలు. నిజానికి ఆ ఆటో తమ్మినేని కారును గుద్దినా…. అపుడు కూడా ఆటోకే నష్టం కానీ… అంతపెద్ద కారు చిన్న ఆటోను ఢీకొంటే ఆటోనుఢీకొన్న తమ్మినేని కారు, ముగ్గురికి గాయాలు అని రాయాల్సింది పోయి ప్రతి మీడియా…. స్పీకర్ గారికి ప్రమాదం తప్పినట్లు రాస్తోంది. ఇలా అయితే… ఎలా?