ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా విపక్షాలు బలపరిచిన అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. వాయిదా పడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో చాలా చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మార్చి నెలలో వాయిదా పడ్డ పరిషత్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలోనే ఆ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల్లో ప్రలోభాలు, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయలేకపోయినవారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పించింది. తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను అభ్యర్థులు సంప్రదిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 20లోపు ఇటువంటి నామినేషన్లను తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు. కలెక్టర్ల నివేదికల ప్రకారం, న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ వెల్లడించింది.
గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లను అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ పేర్కొంది. ఒకవేళ ఫిర్యాదులు లేకుంటే మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ఈ చర్యలు తీసుకుంటున్నామని నిమ్మగడ్డ తెలిపారు. పలు రాజకీయపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల ప్రకారం ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఫిర్యాదు చేసిన వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించాలని ఆర్వోలకు ఎన్నికల కమిషన్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ వేసి స్క్రూట్నీలో ఆమోదం పొందిన అభ్యర్థుల నామినేషన్ బలవంతంగా విత్ డ్రా చేయిస్తే వారు ఆర్వోకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.