ఇటీవల కాలంలో రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పరిణామాలపై మెజారిటీగా ఉన్న హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఆలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం కావడం, ఆయా నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోలేక పోవడం… పైగా మంత్రులు కూడా హద్దు మీరి వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలపై ప్రజలు తీవ్ర అసహనం, ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యవహారశైలిని నిశితంగా గమనిస్తున్న సోషల్ మీడియా నెటిజన్లు సర్కారుపై పదునైన విమర్శలు చేస్తున్నారు. హిందువులంటే.. లెక్కలేదా? అనే ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి దీనికి కారణం?
ఎవరు ఎన్ని అన్నా.. తమ దారి తమదే అన్నట్టుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా జగన్.. రథాలు దగ్ధం చేస్తారు.. వారే రథయాత్రలు చేస్తారు.. అని కామెంట్ చేశారు. అదేసమయంలో ఎవరు చేస్తున్నారో.. తమకు తెలుసని కూడా వ్యాఖ్యానించారు. నిజానికి ఈ వ్యాఖ్యలు వాస్తవమే అయితే.. వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం గట్టిగానే డిమాండ్ చేస్తోంది. సరే.. ఆ విషయం పక్కన పెడితే.. తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకు ప్రధాన పండుగల్లో ఒకటి సంక్రాంతి. ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతల్లో కోడి పందేలు, ఇతర ఆటలు కూడా కొన్ని తరాలుగా నిర్వహిస్తున్నారు.
కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం కోడి పందేలపై ఉక్కుపాదం మోపుతోంది. వాస్తవానికి కోడి పందేలు ఆడేవారు ఏమీ జూదరులు కారు.. నిత్యం వాటితోనే ఉండిపోరు.. ఇది తెలుగు వారికే పరిమితమైన.. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు పేరెన్నిక గన్న.. పరిమిత కాలపు వినోద క్రీడ. కానీ, ఇప్పుడు జగన్ సర్కారు మాత్రం ఎక్కడికక్కడ కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతోంది. గత ప్రభుత్వాలు ఏవీ .. ఇలా చేయలేదు. వారికి కూడా చట్టాలు తెలుసు. కోడి పందేలు నిర్వహించకూడదని కూడా తెలుసు.. కానీ.. మెజారిటీగా ఉన్న హిందువులమనోభావాలకు విలువ ఇచ్చారు. చూసీ చూడనట్టు వ్యవహరించారు. తెలుగు వారి ముఖ్యంగా హిందూ సంప్రదాయ క్రీడలు చాటునో.. మాటునో కొనసాగాయి.
ఇక, పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు హింసాత్మక క్రీడ. అయినా.. ప్రజల మనోభావాలకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. కానీ, ఏపీలో జగన్ సర్కారుకు మాత్రం తమదైన పండుగను నిర్వహించుకునేందుకు కూడా మనసు రావడం లేదని.. జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. నెటిజన్లు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వెంటనే స్పందించే వైసీపీ నాయకులు ఈ విషయంలో తేలుకుట్టినట్టు వ్యవహరిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.