పోలీసులు బాగా అతిచేస్తున్నట్లున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు తెలపటాన్ని కూడా పోలీసులు అడ్డుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. సమస్యల మీద పోరాటాలు చేయటం, జనాలను కూడదీసుకుని ఆందోళనలు చేయటంలో తప్పేలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన, ప్రభుత్వ వైఖరి ప్రజలకు నష్టమని అనుకున్నపుడు ప్రతిపక్షాలు కచ్చితంగా నిరసనలు తెలుపుతాయి. ఇపుడు తెలుగుదేశంపార్టీ చేసింది కూడా ఇదే. ఇంతమాత్రానికే నారా లోకేష్ ను పోలీసులు శ్రీకాకుళం జిల్లాలో అడ్డుకోవటం తప్పు.
లోకేష్ చర్యలవల్ల శాంతిభద్రతలకు ఏమైనా భంగం కలిగినపుడు పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారంటే అర్ధముంది. జిల్లాలోని పలాసకు వెళ్ళి తమ కార్యకర్తను పరామర్శించటం లోకేష్ హక్కు. దీన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారంటే బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. జిల్లాలో లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు విశాఖపట్నం విమానాశ్రయం దగ్గర వదిలిపెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. పోలీసుల చర్యలు చూస్తుంటే జనాల కనీస హక్కులకు కూడా గ్యారెంటీ లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇక్కడ సమస్య ఏమిటంటే పోలీసులను అనుకుని ఉపయోగంలేదు. ఎందుకంటే వీళ్ళకు పైనుండి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటారు. అధికారంలో ఎవరున్నా నోరెత్తకుండా చెప్పినట్లు నడుచుకోవటమే పోలీసుల పనైపోయింది. అయితే పోలీసులు ఎపుడూ గతంలో ఇంత శృతిమించలేదు.
కార్యకర్త కోసం వచ్చిన లోకేష్ ను అడ్డుకోకుండా వదిలి పెట్టేసుంటే అసలు సమస్యే ఉండేది కాదు. మిగిలిన జనాలు పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారో అప్పుడే సీన్ పెద్దదైంది. ఏదేమైనా ప్రతిపక్షాలను అడ్డుకోవటం మాత్రం పోలీసులు చేస్తున్న తప్పని చెప్పక తప్పదు. పోలీసులు చేస్తున్న ఓవరాక్షన్ కారణంగా రేపటి ఎన్నికల్లో తామే మూల్యం చెల్లించుకోవాల్సుంటుందని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి. జరుగుతున్న దాన్ని జనాలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఎప్పుడు రియాక్టవ్వాలో జనాలకు బాగా తెలుసు.