ఏపీలో ఒకేసారి ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీని కేంద్ర ఎన్నికల సంఘం తక్షమే బదిలీ చేయడం.. వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించకుండా దూరం పెట్టాలని ఆదేశించడం.. వంటి పరిణామాలు రాజకీయంగానే కాదు.. సామాజికంగా కూడా పెను చర్చకు దారితీశాయి. ఇది జగన్ సర్కారుకే కాదు.. ఖాకీ యూనిఫాంకు కూడా మచ్చేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి గత ఆరు మాసాలుగా అనేక మంది ఎస్పీలపైనా, కలెక్టర్లపైనా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. తిరుపతిపార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ..అనేక మంది పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా సస్పెన్షన్ వేటు వేసింది.
అప్పటి నుంచి కూడా పోలీసుల వ్యవహార శైలి మార్చుకోవాలని.. ఇటు ప్రతిపక్షాలు అటు, ప్రజాసంఘాలు కూడా కోరుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కొందరు అధికారులలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని కొరడా ఝళిపించే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే.. ఈ వ్యవహారంలో వైసీపీ సర్కారుకు కూడా మరకలు అంటుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా సహకరించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు వైసీపీకి తొత్తులుగా మారారన్న చంద్రబాబు విమర్శలను వారు గుర్తు చేస్తున్నారు.
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, గుంటూరు రేంజి ఐజీ పాలరాజు… కృష్ణా జిల్లా రిటర్నింగ్ అధికారి(కలెక్టర్) రాజబాబు, అనంతపురం జిల్లా రిటర్నింగ్ అధికారి(కలెక్టర్) గౌతమి, తిరుపతి జిల్లా రిటర్నింగ్ అధికారి(కలెక్టర్) లక్ష్మీషాలపై కొరడా ఝళిపించింది. ఇలా వీరిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవడానికి గతంలో వీరిపై వచ్చిన ఫిర్యాదులే కారణమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
+ చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలు, ఓటర్ల జాబితా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదులు రావడం కూడా సదరు ఉన్నతాధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. అనంతపురం ఎస్పీ అన్బురాజన్, జిల్లా కలెక్టర్ గౌతమి… వీరిరువురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందాయి.
+ అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై పట్టించుకోలేదని కలెక్టర్ గౌతమిపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి కలెక్టర్ గౌతమి బంధువు అని తెలిపారు. దీంతో ఆమెను తక్షణం బదిలీ చేశారు. అంతేకాదు.. ఎన్నికల విధులు అప్పగించరాదని కూడా పేర్కొన్నారు.
+ అనంతపురం ఎస్పీ అన్బురాజన్ గతంలో వివేకా కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడీపైనే అక్రమ కేసు పెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎస్పీ అన్బురాజన్ వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఇక, ఇటీవల ప్రధాని పాల్గొన్న `ప్రజాగళం` మోడీ సభలో భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. వీరంతా మూడు మాసాలకు పైగా లూప్లైన్లోనే ఉండనున్నారు.