విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందో లేదో కానీ, వైసీపీ మార్క్ పులివెందుల పోలీసింగ్‌తో అరాచకాలకు అడ్డాగా మారింది. pic.twitter.com/dXMftFLA5h
— Lokesh Nara (@naralokesh) June 6, 2021
నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్ పై పోలీసులు విచక్షణారహితంగా విరుచుపడటం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం.
— Lokesh Nara (@naralokesh) June 6, 2021
ఏపీలోని ఒక ఆసుపత్రి ఉద్యోగినికి ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఏపీ పోలీసులపై తరచూ వచ్చే విమర్శలకు తగ్గట్లు తాజా ఉదంతం ఉండటం గమనార్హం.
తాజా ఉదంతం విశాఖ పోలీసులపై విమర్శలకు అవకాశం ఇస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ ఉదంతంపై ఏపీ డీజీపీ కలుగజేసుకోవాలన్న మాట బలంగా వినిపిస్తోంది. ఆయన ఎంట్రీ ఇస్తే తప్పించి ఈ ఇష్యూ ఒక కొలిక్కి రాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలేం జరిగిందంటే..
విశాఖలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో టైపిస్టుగా పని చేస్తుంటుంది అపర్ణ. లాక్ డౌన్ నేపథ్యంలో ఉదయం ఆసుపత్రికి ఆటోలో వెళ్లే ఆమె.. సాయంత్రం వేళలో మాత్రం ఆమె స్నేహితుడు కానీ.. సోదరుడు కానీ ఆమెను బండి మీద ఇంటికి తీసుకెళుతూ ఉంటారు. కర్ఫ్యూ వేళలో ఆమె ప్రయాణించటానికి అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయి.
శనివారం స్నేహితుడితో కలిసి ఇంటికి వెళుతున్న ఆమె వెంట పత్రాలు లేకపోవటంతో విశాఖ థర్డ్ టౌన్ పోలీసులు ఆమెను ఆపారు. పత్రాలు లేకపోవటంతో ఆమె వాహనాన్ని ఫోటో తీశారు. దీంతో.. ఫైన్ పడినట్లుగా ఆమె సెల్ ఫోన్ కు మెసేజ్ రావటంతో ఆమె వెనక్కి వచ్చి పోలీసుల్ని ప్రశ్నించారు. తనకు అనుమతి ఉన్నప్పుడు ఫైన్ ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు.
చివరకు ఈ ఉదంతం వాగ్వాదానికి దారి తీసింది. దీంతో పోలీసులు ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవటంతో.. ఆమె సెల్ ఫోన్ ను లాక్కున్నారు. దీంతో ఆమె ప్రతిఘటించారు. మహిళా పోలీసుతో పాటు.. ఒక పురుష పోలీసులు ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు.
ఆమెను పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పగా.. అందుకు ఆమె ససేమిరా అన్నారు. చేయని తప్పునకు స్టేషన్ కు ఎందుకు రావాలని ప్రశ్నించారు. నేల మీద పడుకొని ప్రతిఘటించారు.
దీంతో అక్కడే ఉన్న సీఐ అప్పారావు ఆమె మద్యం తాగిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. పరీక్ష చేయాలని చెప్పటంతో.. అపర్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. మీరే మద్యం తాగారేమో.. పని లేకుండా రోడ్డుపై వెళ్లే వారిని వదిలేసి మమ్మల్ని పట్టుకుంటారా? అంటూ మండిపడ్డారు.
ప్రతిరోజు ఏదోకారణంతో తన వాహనానికి ఫైన్ వేస్తే.. తన జీతమంతా జరిమానాలు కట్టడానికే సరిపోతుందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ రానని గట్టిగా తేల్చి చెప్పిన అపర్ణపై.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసు విధులకు అడ్డగించినందుకు.. మహిళా హోంగార్డును గాయపర్చినందుకు.. సెక్షన్ 352, 353 కింద కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ వేళ ఎలాంటి పత్రాలు చూపించకపోవటంతో ఫైన్ వేసినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. పొరపాటున పత్రాలు చూపించకపోతే.. ఆమె బండి నెంబరును.. ఫోన్ నెంబరును తీసుకొని.. పత్రాలు చూపించాలని చెప్పొచ్చు. ఆమెకు తగిన టైం ఇవ్వొచ్చు.
తాజాగా వైరల్ అవుతున్న ఫోటోనుచూస్తే.. ఆమెను ఒక పక్క మహిళా పోలీసు పట్టుకుంటే.. మరోవైపు మగ పోలీసు పట్టుకోవటం అభ్యంతరకరం. మరి.. ఈ తప్పునకు పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా?
నిజానికి ఇలాంటి వాటి విషయాల్ని పెద్దది చేసుకునే కన్నా.. కాస్త జాగ్రత్తగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఉదంతాలు పోలీసు శాఖ మీదనే కాదు.. ప్రభుత్వాల మీదా నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి.
ఈ ఎపిసోడ్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ జోక్యం చేసుకోవాలని.. ఆయన అయితేనే.. ఇలాంటి వాటిని సరిగా డీల్ చేస్తారన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.