ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. విచారణకు రెండుసార్లు డుమ్మా కొట్టడంతో సీరియస్ అయిన పోలీసులు నేడు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వ్యూహం సినిమా ప్రమోషన్స్ టైమ్ లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసి వర్మ అభ్యంతకర పోస్టులు పెట్టారని ఇటీవల టీడీపీ నేత రామలింగం ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు హాజరు కావాలని వర్మకు నోటీసులు ఇచ్చారు. గత మంగళవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వర్మ రావాల్సి ఉండగా.. తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, విచారణకు నాలుగు రోజులు గడువు కావాలని వాట్సాప్ ద్వారా ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ ను కోరారు. దాంతో నవంబర్ 25 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.
కానీ ఈ రోజు కూడా వర్మ డుమ్మా కొట్టడంతో.. పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు రాకుండా తప్పించుకుంటున్న వర్మను అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని వర్మ ఇంటికి ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఇంటికి రావడం పట్ల వర్మ తరఫు లాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. `రామ్ గోపాల్ వర్మకు పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు.. తాము రెండు సార్లు రెస్పాండ్ అయ్యాము. విచారణకు రాకపోవడానికి తగిన కారణాలు చెప్పాము. డిజిటల్ విచారణకు రెడీగా ఉన్నామని కూడా తెలిపాము. అయినా పోలీసులు ఇంటికి రావడం కరెక్ట్ కాదు` అంటూ ఆర్జీవీ తరఫు లాయర్ అన్నారు.