రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష నేతలను, సామాన్యులను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలను వేధించిన తాడిపత్రి డిఎస్పిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నువ్వు ప్రభుత్వానికి తొత్తువి అంటూ జేసీ షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే జేసీ మాదిరిగానే ఏపీ పోలీసులపై తాజాగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి సంచలన విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని విష్ణువర్ధన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐపీఎస్ లు అంటే వైసిపి అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రజాపోరు యాత్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, ఈ ఘటనపై బిజెపికి అనుమానాలున్నాయని అన్నారు. అయితే ఈ ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. ఇక, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లకు 175 గెలుచుకుంటామని చెబుతున్న జగన్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఎందుకు అన్ని స్థానాల్లో గెలిపించాలో ఎందుకు అన్ని సీట్లు ఇవ్వాలో చెప్పాలని నిలదీశారు. ఏది ఏమైనా రాష్ట్రంలో పోలీసులు తీరుపై టిడిపి నేతలతో పాటు బిజెపి నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నడంలో ఎటువంటి సందేహం లేదు.