ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చింది. ఇందులో తెలుసుకోవాల్సిన కొత్త విషయాలున్నాయి. మన సీఎం జగన్ మాట తప్పిన విషయాలున్నాయి. అంతకుమించి… మందుబాబులకు మరింత స్వేచ్ఛ ఇచ్చిన విషయాలున్నాయి. ఇప్పటి వరకు కనీసం ఆడవాళ్లయినా కొనడానికి మొహమాటపడే పరిస్థితి ఉండేది. మీకు ఆ మొహమాటం అవసరం లేదమ్మా… మాల్స్ పెడతా, మీకు నచ్చినంత మీరే సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని తాగేసేయండని జగన్ సర్కారు ఈ పాలసీ తెచ్చింది.
ఇంతకాలం సరుకులు బుట్టలో వేసుకుని వస్తూ.. కౌంటర్లో బిల్లు కట్టేసేవాళ్లం. ఆ సౌలభ్యం జగనన్న మందుకు కూడా కల్పించారు. మద్యం కనపడకుండా చేస్తా, మధ్య నిషేధం చేస్తా అని చెప్పిన జగనన్న దేశంలో అరుదైన విధానాన్ని ప్రవేవపెడుతున్నారు. `లిక్కర్ మాల్స్`కు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. కొత్త మద్యం పాలసీలో మాల్స్‌కు పెద్దపీట వేసింది. నెల రోజుల్లో ప్రధాన నగరాలు, పట్టణాల్లో 80 లిక్కర్ మాల్స్‌ను ఏర్పాటవుతాయి. ఈ మేరకు తాజా పాలసీలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మాల్స్‌లో లోక్లాస్, ప్రీమియం బ్రాండ్లు కాకుండా.. వాటిని మించిన ఖరీదైన బ్రాండ్ మద్యాన్ని, విదేశీ మద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. గాజు అద్దాల షోరూంలా.. రంగు రంగుల విద్యుత్ లైట్ల కాంతుల్లో ఉండే మాల్లో లిక్కర్ బాటిళ్లను అందంగా పేర్చనున్నారు.
మద్యం షాపులను తొలగిస్తానన్న జగన్ తన ఒట్టును తీసి పక్కన పెట్టి వచ్చే నెల 1 నుంచి భారీ మాల్స్ కి అనుమతి ఇచ్చేశారు. ఏటా షాపులు తగ్గిస్తానని చెప్పిన పెద్దమనిషి ఈ మాల్స్ ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న షాపుల సంఖ్య పెరిగినట్టయ్యింది. తాజా పాలసీలో షాపుల కుదింపునకు సంబంధించి ఎలాంటి విషయమూ పేర్కొనకపోవడం గమనార్హం. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక మాల్స్ చొప్పున 80 మాల్స్ తెచ్చారన్నమాట. మరి యాజమాన్యాలు ఎవరివో వాటిని ఎవరికి కేటాయిస్తారో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా పాఠకులకు .. అంతేనా !!
కొసమెరుపు – ఇటీవల తిరుమల డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో కంటితుడుపు చర్యగా… తిరుపతిలో అలిపిరి దారిలో షాపులు అనుమతి ఇవ్వడం లేదు. వాటిని వేరే చోట పెట్టుకోవచ్చు. అయితే, శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులు మాత్రం అసలు తిరుపతిలో మొత్తం మద్యనిషేధం చేయాలని కోరుతున్నారు.