ఏపీలో కొందరు పోలీసు అధికారులుె అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీకి ఎన్నికల సంఘం షాకిచ్చిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేయడంతో వైసీపీకి షాక్ తగిలినట్లయింది. రాజేంద్రనాథ్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విపక్షాల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఆయనపై బదిలీ వేటు వేసింది.
ఈ క్రమంలోనే సీనియారిటీ ప్రకారం ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాని ఈసీ నియమించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించని గుప్తాకు పోలీస్ అధికారులు గౌరవ వందనం సమర్పించి ఘన స్వాగతం పలికారు. తక్షణం విధుల్లో చేరాలన్న ఈసీ ఆదేశాలతో మంగళగిరిలోని కార్యాలయంలో గుప్తా పోలీస్ బాస్ గా విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.