వైసీపీ నేతలపై నియోజకవర్గ స్థాయిలో అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. కొందరు నియోజకవర్గాలకు కడు దూరంగా ఉండడం.. మరికొందరు తమ సొంత వ్యాపారాలు వ్యవహారాల్లో మునిగి తేలుతుండడంతో సదరు నేతలపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ కోవలేకే చేరిపోయారట.. మంత్రి ఆదిమూలపు సురేష్.
ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గం నుంచి గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన సురేష్‌కు.. సీఎం జగన్ మంత్రి పీఠాన్ని అందించారు. ఇలా తమ నియోజకవర్గానికి చెందిన నాయకుడు తొలిసారి మంత్రి కావడంతో నియోజకవర్గం ప్రజలు పండ గ చేసుకున్నారు. తమకు అన్ని విధాలా ఆయన అందివస్తారని అనుకున్నారు. సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి.
మంత్రిగా సురేష్ నియోజకవర్గానికి ఆయన ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇక్కడి సమస్యలు పట్టించు కోవడం మానేశారు. నియోజకవర్గంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నా.. పరిష్కారం అవుతున్న సమస్యలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇదే విషయం.. ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన రివ్యూలోనూ వెలుగు చూసింది. దీంతో మంత్రి నియోజకవర్గంలో ఉంటున్నారా? అని సీఎం ఆరాతీసే పరిస్థితి వచ్చింది.
ఇక, సురేష్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఆయనకు నిలకడగా ఇప్పటి వరకు ఒక నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. గతంలో ఆయన ఇదే జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన సురేష్ అప్పట్లోనూ విజయం సాధించారు. అయితే. తర్వాత.. మారిన సమీకరణల నేపథ్యంలో ఆయనను ఎర్రగొండపాలెంకు పంపారు.
తనకు ప్రత్యేకంగా ఒక నియోజకవర్గం కేటాయించకపోవడం.. ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్కుతాననే భరోసా ఉండడం, అదేసమయంలో నియోజకవర్గం రాజకీయాలకు ఆయన దూరంగా ఉండడం.. సొంతగా విద్యాసంస్థలు ఉండడం వంటివి ..ఆయన పెద్దగా ఏ నియోజకవర్గాన్నీ పట్టించుకోవడం లేదని అంటున్నారు పరిశీలకులు. గతంలో సంతనూతలపాడులోనూ ఇదే సమస్య వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఏడాదిన్నర కాలం ముగిసినా.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అంటున్న ఎర్రగొండపాలెం.. ప్రజల ఆవేదన వెనుక రీజన్ ఇదేనని తెలుస్తోంది. మరి మంత్రికి ఇది న్యాయమేనా? అంటున్న ప్రజలకు ఆయన ఏం సమాధానం చెబుతారో చూడాలి.