- మళ్లీ మందు బాబుల తాకట్టు
- బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 25 వేల కోట్లు తెచ్చేందుకు యత్నాలు
- 1,400 కోట్ల రుణం కట్టలేని సంస్థకు పాతిక వేల కోట్లు అప్పిచ్చేదెవరు?
- ఈ కార్పొరేషన్ పేరుతో అప్పు.. వాడేది ప్రభుత్వ అవసరాలకు
జగన్ సర్కారు చేస్తున్న అప్పుల తప్పులకు అంతమే లేదు. ధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానన్న సీఎంకు ఇప్పుడు ఆ మద్యమే కామధేనువైంది. ఇప్పటికే మందు బాబులను తాకట్టు పెట్టి రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) ద్వారా దొడ్డిదారిన తెచ్చిన రూ.21,500 కోట్ల రుణాలు తేవడం రాజ్యాంగ ఉల్లంఘన అని కేంద్రం తేల్చిచెప్పింది.
ఈ అక్రమ వ్యవహారాలపై కోర్టులో కేసులు కూడా పడ్డాయి. అయినా సరే మళ్లీ మద్యంపై వేసిన అదనపు పన్ను ఆదాయాన్ని తాకట్టుగా పెట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.25,000 కోట్లు అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 10 మద్యం డిపోలకు సంబంధించిన అదనపు పన్ను ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ఎస్ర్కో చేసి ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
ఇప్పుడు మిగిలిన 20 మద్యం డిపోలకు సంబంధించి న అదనపు ఎ క్సైజ్ పన్ను రూపంలో వచ్చే ఆదాయాన్ని రోజువారీగా ఆ కార్పొరేషన్‌కు మళ్లించాలని నిర్ణయించింది. దానిని రీపేమెంట్గా చూపి బ్యాంకుల నుంచి అప్పు తేవాలని ప్రయత్నిస్తోంది. సగటున రోజూ ఈ 20 డిపోల ద్వారా రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
ఈ మొత్తం ఆదాయాన్ని ఏ రోజుకారోజు ఆ కార్పొరేషన్‌కు మళ్లించడంతో పాటు ఆ అప్పు మొత్తానికి గ్యారెంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఖజానాకు రావాల్సిన మద్యంపై అదనపు పన్ను ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు మళ్లిస్తామని బ్యాంకులతో కుదిరిన ఒప్పందాల్లో పేర్కొంది. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం చెప్పింది.
కోర్టుల్లో కేసులు దాఖలై విచారణ జరుగుతోంది. ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ విషయంలో ఆ అదనపు ఆదాయాన్ని కార్పొరేషన్‌కు ఎలా మళ్లిస్తారు? రాజ్యాంగంలో ఎస్ర్కో అనే పదం వాడారు కాబట్టి ఈ సారి దానిజోలికి వెళ్లకుండా ఇంకెదైనా పదం వాడి బురిడీ కొట్టిస్తారా? ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మరో రూ.45,000 కోట్ల అప్పునకు అనుమతివ్వాలని అడగ్గా కేంద్రం తిరస్కరించిన సంగతి తెలిసిందే.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులనే నమ్ముకుని వాటి చుట్టూనే ప్రదక్షిణలు చేస్తోంది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ అక్రమాలు వెలుగులోకి వచ్చాక కొన్ని బ్యాంకులు వెనక్కి తగ్గినప్పటికీ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం అప్పులిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
అవి సిద్ధంగా ఉంటే తక్షణమే జీవోలు ఇచ్చేసుకుని, ఒప్పందాలపై సంతకాలు పెట్టుకుని అప్పులు తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
బెవరేజెస్ కార్పొరేషన్‌కు అన్ని డబ్బులెందుకు ?
బెవరేజెస్ కార్పొరేషన్ రూ.25,000 కోట్లతో ఏం చేస్తుంది? ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ? లేదా పేరుకుపోయిన బకాయిలు తీర్చడానికా? ఆ కార్పొరేషన్లో పేరుకుపోయిన బకాయిలు రూ.25,000 కోట్ల కంటే చాలా తక్కువే ఉంటాయి.
వ్యాపారాన్ని విస్తరించడం అనేది మద్యపాన నిషేధం అంటున్న ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం. కాబట్టి అలవాటైన పద్ధతిలో కార్పొరేషన్ ఖాతాలో తెచ్చిన అప్పును ప్రభుత్వమే వాడుకోవాలనేది దీని అంతర్యం. గత ఏడాది మార్చిలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ.1400 కోట్ల క్యాష్ క్రెడిట్ లోను చెల్లించడానికే బెవరేజెస్ కార్పొరేషన్ ఆపసోపాలు పడుతోంది.
రూ.1400 కోట్లకు కూడా భవిష్యత మద్యం ఆదాయం తాకట్టు పెడుతున్నట్టు దానికి సంబంధించిన జీవోలో రాశారు. ఈ క్యాష్ క్రెడిట్ లోనును పేరుకున్న బకాయిలు చెల్లించేందుకు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ రుణాన్ని కార్పొరేషన్ పూర్తిగా కట్టి, మళ్లీ తీసుకుంటుందా? లేదా బ్యాంకు 6 నెలలకొకసారి రీషెడ్యూల్ చేస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఈ కార్పొరేషన్ పేరుతో రూ.25,000 కోట్ల అప్పు ఇవ్వడానికి ఏ బ్యాంకు ముందుకు వస్తుందో చూడాలి.
తాగడం చాలా వీజీ!
రాష్ట్రంలో ఇకపై క్యాన్ బీర్లు, 90 ఎంఎల్ బుడ్డీలలో మద్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీరును సీసాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. 650 ఎంఎల్, 350 ఎంఎల్ సీసాల్లో బీరు దొరుకుతోంది. బీర్లు తాగేవారికి నచ్చే, మెచ్చే బ్రాండ్లు దొరక్కపోవడం… ధర భారీగా ఉండడం వేరే సంగతి.
ఇప్పుడు.. టిన్ బీర్లనూ అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. మద్యం వినియోగం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే… సీసాల్లో ఉన్న బీరును కొని బయట తాగడమే కష్టం. బరువుగా, పొడవాటి సీసాలను తీసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది. టిన్ బీర్లు అలా కాదు.
చేతిలో ఇమిడిపోతాయి. స్టైల్‌గా ఉంటాయి. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లి, అంతే సులువుగా తాగేయవచ్చు. 330 ఎంఎల్, 500 ఎంఎల్… ఇలా రెండు రకాల క్యాన్లలో బీరును అందుబాటులోకి తెస్తున్నారు. ఇలాంటి వెసులుబాటు కల్పిస్తూ కూడా… ‘మద్య వినియోగం తగ్గించేందుకే’ క్యాన్బీర్లు అందుబాటులోకి తెస్తున్నామనడం గమనార్హం.
క్యాన్లతో బీర్ విక్రయాలు మరింత పెరుగుతాయని అధికారులే అంగీకరిస్తున్నారు. బీర్ అమ్మకాలు పెంచడమే సర్కారు ఉద్దేశం అనే వాదన కూడా వినిపిస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న గ్రామాల్లోని మద్యం దుకాణాల్లో ‘90ఎంఎల్’ మద్యం సీసాలను ఎక్కువగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఒక క్వార్టర్… అంటే 180 ఎంఎల్ సీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 90ఎంఎల్ సీసాలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఒక క్వార్టర్ సీసా కొనాలంటే కనీసం రూ.200 పెట్టాల్సి వస్తోంది. దీంతో తక్కువ రేట్లకు వస్తున్నాయని పక్క రాష్ట్రం మద్యం, నాటుసారాకు మొగ్గుచూపుతున్నారని… అందుకే, సుమారు రూ.వందకే దొరికేలా ఇక్కడే 90ఎంఎల్ సీసాలు తెస్తే అక్రమ మద్యం తగ్గిపోతుందని అధికారులు వాదిస్తున్నారు.
పిచ్చి పిచ్చి బ్రాండ్లకు అధిక ధర పెట్టడమే అసలు సమస్య. దీనివల్లే ‘పొరుగు’ మద్యం మన రాష్ట్రంలోకి ప్రవహిస్తోంది. నాటుసారా విక్రయం కూడా పెరుగుతోంది. ఈ విషయాన్ని పక్కనపెట్టి… 90 ఎంఎల్ బుడ్డీలను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెబుతోంది.