ఔను.. ఇది నిజమేనని అంటున్నారు నెటిజన్లు. తాజాగా హైకోర్టు ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వకపోవడం.. చాలా జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు చిప్ప పట్టుకుని రోడ్లపై నిరసన వ్యక్తం చేయడం వంటివాటిని హైకోర్టు నిలదీసింది. జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కడం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశారా? అంటూ.. సర్కారును నిలదీసింది.
అంతేకాదు.. ఇది దురదృష్ట పరిస్థితి కాదా అంటూ ప్రశ్నలు సంధించింది. జీతాల కోసం బెగ్గింగ్ ఎప్పుడూ చూడలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులకు జీతాలివ్వరు కానీ, అక్రమ నిర్మాణా లకు 40 కోట్ల బిల్లులు చెల్లిస్తారా అని ప్రశ్నించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రభుత్వ పాఠశాల ప్రాంగ ణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాల్ చేస్తూ.. అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిపైరెండేళ్లుగా విచారణ సాగుతోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టుకు పిలిచిన న్యాయమూర్తులు.. ఆయనను నిలదీశారు. సీఎస్ జవహర్‌రెడ్డిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వ లోపాలను తూర్పారపట్టింది. ఈ నిర్మాణాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అఫిడవిట్ పరిశీలించాక ఆ నిర్మాణాలను కూల్చాలా, లేదా అనే అంశాన్ని తేల్చడంతో పాటు వాటికి చెల్లించిన 40 కోట్లను బాధ్యులైన అధికారుల నుంచి రాబట్టే వ్యవహారంపై ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. ఇక, ఇప్పటికే సీఎస్‌లుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కేసులో హైకోర్టు గడప తొక్కిన వారే కావడంతో .. జగన్ సర్కారుకు పరువు ఎక్కడ మిగిలి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.