సీఎం జగన్ చేస్తున్న అప్పులు…దానికోసం పడుతున్న తిప్పలు…ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ప్రధాని మోడీ…ఏపీ అప్పులపై ఫోకస్ చేశారు. ఇలా అయితే, ఏపీ ఆర్థిక వ్యవస్థ మరో రెండు నెలల్లో కుప్పుకూలుతుందంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అభిప్రాయపడ్డారు. ఇంత జరుగుతున్నా…జగనన్న మాత్రం సంక్షేమ పథకాల విషయంలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెబుతూ తగ్గేదే లే అంటూ ముందుకు పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇక, జగన్ ది అసమర్థ పాలన అంటూ ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తుంటే…ఇది రాజకీయాల్లో కామన్ లే అనుకున్నవారంతా ఈ విషయం తెలిస్తే ఒళ్లుమండడం ఖాయం. నవరత్నాల పేరుతో వేల కోట్లు ఖర్చుపెడుతున్న జగన్…కేవలం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేక 20 వేల కోట్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని తెలిస్తే ప్రతిపక్ష నేతలకే కాదు…పౌరుషం ఉన్న ప్రతి ఆంధ్రుడి కడుపు రగిలిపోవడం ఖాయం. భావితరాల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న జగన్ పై ఆంధ్రులంతా తిరగబడడం ఖాయం అన్న రీతిలో వెలుగులోకి వచ్చిందీ ఉదంతం.
దాదాపు 22వేల కోట్ల రూపాయల అంచనాతో 2016లో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే (ఎన్‌హెచ్544ఎఫ్)ను ప్రతిపాదించగా కేంద్రం 2018లో ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు భూసేకరణకు 2వేల కోట్లు ఖర్చవుతుందని నాడు అంచనా వేశారు. అయితే, నాటి టీడీపీ ప్రభుత్వం తాము వెయ్యి కోట్లు భరించగలమని చెప్పడంతో కేంద్రం సరేనంది. ఆ తర్వాత డీపీఆర్‌లను కేంద్రం ఆమోదించింది. ఈ రహదారికి ఎన్‌హెచ్ 544ఎఫ్ అనే నంబరు కూడా కేటాయించారు. భూసేకరణ పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే 3డి నోటిఫికేషన్ జారీచేశారు. ఆ తర్వాత ప్రాజెక్టును వేగంగా చేపట్టేందుకు భారత్‌మాల జాబితాలో చేర్చారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మర్రూరు నుంచి అమరావతి పరిధిలోని పెదపరిమి వరకు 385 కి.మీ. పొడవున.. ఎలాంటి మలుపులు లేకుండా ఉండేలా ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను డిజైన్ చేశారు. కర్నూలు, కడప జిల్లాల నుంచి వచ్చే రహదారులను అనుసంధానం చేసేలా డిజైన్లు రూపొందించారు. కేవలం 6గంటల వ్యవధిలోనే అనంతపురం నుంచి అమరావతికి చేరుకునేలా.. గంటకు కనీసం 100 కి.మీ. వేగంతో ప్రయాణించేలా ఈ ప్రాజెక్టుకు నాటి సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారు. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో 2019లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది.
అమరావతిపై కక్ష గట్టిన జగన్…ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. 3 రాజధానులంటూ అమరావతిని నిర్లక్ష్యం చేశారు. అధికార వికేంద్రీకరణను తెరపైకి తెచ్చాక దీనిని పక్కనపెట్టేశారు. ఇక, అప్పుల ఊబిలో మునిగిపోయిన జగన్ సర్కార్ 20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కోసం కనీసం వెయ్యి కోట్లు కూడా ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కబోతోందని తెలుస్తోంది. దానికి బదులు బెంగళూరు-గుంటూరు ఎక్స్‌ప్రె్‌సవేను తెరపైకి తీసుకురాబోతున్నారు. కడప, పులివెందుల, మైదుకూరు, ఇతర ప్రాంతాలను కలుపుతూ కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వరకు కొత్త రహదారిని తీసుకెళ్లి దాన్ని బెంగళూరు హైవేకి కలపాలన్నది ప్రతిపాదన.
అయితే, మిగతా జిల్లాలవారు ఫీల్ కాకుండా నెల్లూరు-అనంతపురం, ప్రకాశం-అనంతపురం, గుంటూరు-అనంతపురం ప్రాజెక్టులు కూడా చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. వీటన్నిటికీ కేంద్రం సమ్మతిస్తుందా.. లేక అవి కూడా ప్రతిపాదనలకే పరిమితమవుతాయా అన్నది త్వరలో తేలనుంది. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే సాకారమయితే అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు అద్భుతమైన రహదారి కనెక్టివిటీ వస్తుంది. రహదారి వెంటే ఇండస్ట్రియల్, గ్రోత్ కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. యువతకు లెక్కలేనన్ని ఉపాధి అవకాశాలొస్తాయి. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే మణిమకుటం అవుతుంది. కేవలం టీడీపీ హయాంలో చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్టు కాబట్టి అన్ని అనుమతులు వచ్చిన ఈ ప్రాజెక్టును జగన్ వద్దంటున్నారని విమర్శలు వస్తున్నాయి.