అందరు అనుమానిస్తున్నట్లే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరికే కమీషనర్ రెడీ అయిపోయారు. మార్చిలో అర్ధాంతరంగా వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో తాజాగా కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలు చూస్తుంటేనే నిమ్మగడ్డ ఆలోచనలు ఏమిటో అర్ధమైపోతోంది.
వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించటానికి ఎలక్షన్ కమీషన్ సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే అప్పట్లో జరిగిన ఏకగ్రీవాలన్నింటినీ రద్దు చేయాలని మెజారిటి పార్టీలు సూచించినట్లు అఫిడవిట్లో చెప్పారు నిమ్మగడ్డ. ఎన్నికలను నిర్వహించే విషయంలో నిమ్మగడ్డ ఆ మధ్య రాజకీయపార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. 19 పార్టీలను ఆహ్వానిస్తే 11 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు.
వీరిలో అత్యధికులు ప్రకటించిన ఏకగ్రీవాలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరపాలని అడిగినట్లు నిమ్మగద్ద తన అఫిడవిట్లో చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ కు సహకరించాలన్నారు. కరోనా వైరస్ కారణంగానే మార్చిలో ఎన్నికలను వాయిదా వేసినట్లు కమీషనర్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. కానీ ఇపుడు కరోనా వైరస్ ఉధృతి తగ్గింది కాబట్టి ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉందని చెప్పారు. వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించాలని అనుకున్నదానికి నిమ్మగడ్డ చూపిన కారణాలు ఏమిటంటే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం, తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రెడీ అవటాన్ని తన అఫిడవిట్లో చెప్పారు. మార్చిలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న కారణంగానే అప్పట్లో ఎన్నికల వాయిదాకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఎన్నికలను వాయిదా వేసినపుడు రాష్ట్రం మొత్తం మీద నమోదైన కరోనా వైరస్ కేసులు పట్టుమని రెండు కూడా లేవు. కానీ ఇపుడు సగటున రోజుకు 3 వేలు నమోదవుతున్నాయి. అయితే, అపుడు వైరస్ విపరిణామాలు, ప్రమాదాలు, జాగ్రత్తలు, మందులు ఎవరికీ అవగాహన లేదు. ఇపుడు అవగాహన ఉంది కాబట్టి… అన్ లాక్ లో అన్నీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి.