తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జూనియర్ డాక్టర్లు మెరుపు సమ్మెకు దిగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చాలాకాలంగా ప్రభుత్వానికి విన్నపాలు చేసుకుంటున్నప్పటికీ స్పందన రాలేదని, విధిలేక సమ్మెకు దిగామని జూడాలు చెప్పారు. ఆ తరువాత ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం కావడంతో తాజాగా జూడాలు సమ్మె విరమించారు. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరలేదని, కానీ, సీఎం సానుకూల స్పందనతో పాటు ప్రజారోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నామని జూడాలు వెల్లడించారు.
తెలంగాణలో జూడాల సమ్మె సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో..వారిని స్పూర్తిగా తీసుకొని ఏపీలో జూడాలు తాజాగా సమ్మె బాట పట్టడం చర్చనీయాంశమైంది. తమకు కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని, ఎక్స్ గ్రేషియా అంశం, స్టయిఫండ్‌లో టీడీఎస్ కోత విధించవద్దని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 9న కొవిడ్‌తో సంబంధం లేని విధులు, 10న కొవిడ్ విధులు, 12న కొవిడ్ అత్యవసర విధులను బహిష్కరించాలని జూడాలు నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారించాలని కోరుతున్నారు.
వాస్తవానికి ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న జూడాలకు మెరుగైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్లున్నాయి. అయినప్పటికీ, జగన్ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వైద్యరంగంపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పే జగన్…చేతల్లో మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్న జూనియర్ డాక్టర్లు…ఇక ఫలితం లేదనుకొని…తాజాగా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నామని అంటున్నారు. మరి, ఈ సమ్మెపై జగన్ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.