ఏపీలో పెట్టబడులే లక్ష్యంగా ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్లా, బోసన్ వంటి పలు దిగ్గజ కంపెనీలతో భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన లోకేష్ తాజాగా లాస్ వెగాస్‌లో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ అయ్యారు. పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా నూయితో లోకేష్ మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఏపీ రూపకల్పనలో మద్దతివ్వాలని ఇంద్రా సూయీని లోకేష్ కోరారు.
విజనరీ లీడర్, ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తున్నామని ఆమెకు వివరించారు. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని, నాయకత్వం, సాంకేతికతలో లింగ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. కార్పొరేట్, ప్రభుత్వరంగాల భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.
విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువ నిపుణులు వారి కెరీర్లో విజయం సాధించడానికి మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించాలని కోరారు. ఏపీ సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను చూసేందుకు తమ రాష్ట్రాన్నిసందర్శించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడుల రాబడికి తమ వంతు సహకారమందిస్తానన్నారు.