ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ వారం రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024 లో లోకేష్ పాల్గొన్నారు. దాదాపు 100 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఓ వైపు వరుస సమావేశాలు, సదస్సులతో బిజీగా ఉన్న లోకేష్ తనకు అత్యంత సన్నిహిత కుటుంబంతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. టెక్సాస్ లోని ఒడిస్సీలో ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో దీపావళి పండుగను లోకేష్ సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలో ఆ కుటుంబానికి సన్నిహితులైన కొందరు ఎన్నారై ప్రముఖులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఓ వైపు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటూనే లోకేష్ పెట్టుబడులు ఆకర్షించే పనిలో కూడా బిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు దీపావళి నాడు ఏర్పాటు చేసిన ఒక అధికారిక సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆ సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులకు లోకేష్ ఆహ్వానం పలికారు. పండుగనాడు కూడా రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించిన లోకేష్ పై ఎన్నారైలు ప్రశంసలు కురిపించారు.