అమలాపురంలో తాజాగా జరిగిప భారీ విధ్వంసానికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే ప్రధాన కారణమని తెలుస్తోం ది. ప్రజాగ్రహం, ఆందోళన తీవ్రరూపం దాల్చి సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసాలకే నిప్పు పెట్టడం, వాటిలో ప్రాణభయంతో ఉన్నవారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితులు తలెత్త టం, ఏకంగా జిల్లా ఎస్పీపైనే రాళ్ల దాడి, ఆయన్ను మిగతావారు కాపాడాల్సి రావడం వంటి ఘటనలు కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో జరగలేదు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పేందుకు మంగళవారం నాటి ఘటనలే తార్కాణం. దీనికి పూర్తిగా పోలీసు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలే విఫలమయ్యాయని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తొలుత కోనసీమ పేరిట జిల్లాను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. దాని పేరును డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఈ నెల 18న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. దానిపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజులు గడువిచ్చింది. అమలాపురం కలెక్టరేట్లో లిఖితపూర్వకంగా అభ్యంతరాలు అందజేయాలని పేర్కొంది.
ప్రాథమిక నోటిఫికేషన్ జారీ కాగానే పేరు మార్పునకు వ్యతిరేకంగా పలువురు సంఘటితమయ్యారు. ‘కోనసీమే ముద్దు… మరే పేరూ వద్దేవద్దు’ అంటూ ఈ నెల 20న అమలాపురంలో ఆందోళనలు నిర్వహించారు. వేలమంది చేరి కలెక్టరేట్ గేట్లు తోసేసి మరీ లోపలికి వెళ్లారు. తర్వాత సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపించుకుని ఏకతాటిపైకి వచ్చారు. ఈ పరిస్థితి మరింత జటిలంగా మారకముందే అప్రమత్తం కావాల్సిన పోలీసులు, ఇంటిలిజెన్స్ తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయారు.
కోనసీమలో జూన్ 30 వరకూ సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉంటాయని.. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని ప్రకటించారు. అయితే ఆ దిశగా తగిన కార్యాచరణ అమలు చేయటంలో విఫలమయ్యారు. కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం తలపెట్టిన కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం తరలివస్తారనే విషయాన్ని ముందుగా అంచనా వేయలేకపోయారు.
వందల్లోనే వస్తారని భావించి… వారిని నియంత్రించేందుకు వీలుగా పోలీసు పికెట్లు, సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వేల మంది యువకులు పోటెత్తటంతో వారిని అదుపు చేయటం పోలీసుల వల్ల కాలేదు.
ఇంటిలిజెన్స్ మొద్దు నిద్ర!
కుల సమీకరణాల పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన కోనసీమలో చిన్న వివాదం కూడా పెద్ద పెద్ద ఘర్షణలకు దారితీసిన అనుభవాలు గతంలో చాలా ఉన్నాయి. అలాంటిచోట జిల్లా పేరు మార్పుపై అభ్యంతరం తెలుపుతూ గత నాలుగైదు రోజులుగా భారీ నిరసనలు చేపడుతూనే ఉన్నారు. అవి తీవ్రరూపం దాల్చక ముందే పరిస్థితి అంచనా వేసి జాగ్రత్తపడాల్సిన , ముందుగానే హెచ్చరికలు జారీ చేయాల్సిన ఇంటిలిజెన్స్ ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది.
నిరసనలు తెలుపుతున్న వారి అభ్యంతరాలేంటో చర్చల ద్వారా తెలుసుకోలేకపోయారు. సాక్షాత్తూ.. మంత్రి ఇంటికే ఒక ఎమ్మెల్యే ఇంటికే నిప్పు పెట్టే పరిస్థితి ఉంటే.. సామాన్యులకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందా? అనేది ఇప్పుడు మేధావులు అడుగుతున్న మాట.