జగన్ సర్కార్ కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై సీఐడీ విచారణ జరపడంపై హైకోర్టు స్టే విధించింది. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన సీఐడీ నోటీసులపై టీడీపీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లను విచారణ జరిపిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
చంద్రబాబు సీఐడీ విచారణతో పాటు ఈ కేసు విచారణపైనా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలుంటే చూపించాలని సీఐడీని హైకోర్టు న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో గుర్తించిన అంశాలను వెల్లడించాలని కోరారు. అయితే, విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతించాలని, అప్పుడు అన్ని విషయాలు విచారణ జరిపి కోర్టుకు వెల్లడిస్తామని తెలిపారు.
దీంతో ఈ కేసు విచారణపై హైకోర్టు న్యాయమూర్తి స్టే విధించారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు. తాజాగా స్టే రావడంతో చంద్రబాబు, నారాయణలకు ఊరట లభించినట్లయింది.
అంతకుముందు, తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఈ కేసులో అరెస్టుతోపాటు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మరోవైపు, చంద్రబాబుపై విచారణ కోర్టులో నిలబడదని న్యాయనిపుణులు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వారు చెప్పినట్లుగానే చంద్రబాబుక స్టే వచ్చింది.